భవన నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు స్థలసేకరణలో జాప్యం కొనుగోలుదారులకు అందని నాణ్యమైన మాంసం చనిపోయిన జీవాలను కోస్తున్న వ్యాపారులు చోద్యం చూస్తున్న అధికారులు
వధశాల లేక ప్రజలకు నాణ్యమైన
మాంసం అందటం లేదు. ధనార్జానే ధ్యేయంగా కొందరు వ్యాపారులు
వ్యాధులబారిన పడిచనిపోయిన జీవాలను కోస్తుండటంతో వాటిని తిన్న ప్రజలు అనారోగాల బారిన పడుతున్నారు. వధశాల భవన నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరైనా, స్థలసేకరణలో అధికారుల జాప్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఫలితంగా నిధులు వాపస్‌పోయే పరిస్థితి నెలకొంది. – మెదక్‌జోన్
మెదక్ బల్దియా ఏడుదశాబ్దాల క్రితం ఏర్పడింది. ఇందులో 13 వేలపైచిలుకు ఇళ్లు ఉండగా 80 వేలకుపైగా జనాభా ఉన్నారు. కాగా ఇక్కడ మాంసం విక్రయధారులు(వ్యాపారులు) 50 మంది వరకు ఉన్నారు. ప్రతీరోజు వందకుపైగా జీవాలు గొర్రెలు, మేకలు వధించి మాంసం విక్రయాలు చేస్తున్నారు. గతంలో పట్టణంలోని ఫతేనగర్ ప్రాంతంలో జీవాలను వధించే (కబేళా)ఉండేది. వాటి చుట్టూ ఇళ్లు ఉండటంతో దుర్వాసన వస్తుందని అక్కడి ప్రజల నుంచి వ్యతిరేకత రావటంతో అక్కడ జీవాలను వధించటం మానేశారు. దీంతో ప్రత్యేకంగా వధశాల నిర్మాణానికి గత 2022లో రూ.2 కోట్లు మంజూరైంది. స్థలసేకరణకోసం పట్టణంలోని 11వ వార్డులోని దుర్గాకాలనీలో ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. కానీ వధశాల నిర్మిస్తే దుర్వాసన వెదజల్లుతుందని, కాలనీ వాసులు వ్యతిరేకించారు. దీంతో మరోచోట స్థలాన్ని సేకరించాల్సిన అధికారులు దాని ఊసే ఎత్తటంలేదు. ఫలితంగా మంజూరైన రూ.2 కోట్లు వాపస్ పోయే పరిస్థితి నెలకొంది.
వధశాల లేకపోవటంతో కొందరు వ్యాపారులకు ఆడిందే ఆట పాడిందే పాటగా మారి పోయింది. చనిపోయిన జీవాలను వధిస్తున్నారనే ఆరోప ణలు వెల్లువెత్తుతున్నాయి. అనారోగ్యంతో జీవాలు చనిపోతే వాటి కాపరులు వ్యాపారులకు సమాచారం ఇవ్వాగానే వాటిని కోసి విక్రయిస్తున్నారు. ఫలితంగా ప్రజలు అనారోగ్యాల గురవుతున్నారు. కుళ్లిన మాంసం విక్రయిస్తున్నారంటూ గతంలో మెదక్ పట్టణంలో అనేకసార్లు గొడవలు జరిగిన సందర్భాలు కోకొల్లలు. అంతేకాకుండా ఎక్కడ పడితే అక్కడ రోడ్లపక్కన జీవాలను వధించటంతో ఆ ప్రాంతాల్లో దుర్వాసన వస్తోంది. ఈగలు, దోమలకు ఆ ప్రాంతాలు నిలయంగా మారి అవి మాంసంపై వాలటంతో వాటి ద్వారా ప్రజలకు వ్యాధులు సంక్రమిస్తున్నాయి.
వధశాల భవనాన్ని నిర్మిస్తే పట్టణంలో కోసే ప్రతీ గొర్రె, మేకలను ఒకేచోట వధించే అవకాశముంటుంది. ఆ భవనంలో వెటర్నరీ డాక్టర్ నిరంతరం అందుబాటులో ఉంటాడు కాబట్టి జీవాలను పరిశీలించి ఆరోగ్యంగా ఉందని సర్టిఫై చేసే వాటిని మాంసం విక్రయదారులు వధిస్తారు. దీంతో ప్రజలకు నాణ్యమైన మాంసం అందుతుంది. ప్రజలు అనారోగాలకు గురికాకుండా ఉంటారు. కానీ ప్రస్తుతం వధశాల లేకపోవటంతో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు వధిస్తుండటంతో ఎలాంటి మాంసాన్ని విక్రయిస్తున్నారో వ్యాపారులకే తెలియాలి.


