● కౌలు రైతులనూ ఆదుకోవాలి ● పంట నష్టం వివరాలు సేకరించిన ప్రజా సంఘాల నేతలు
టేక్మాల్(మెదక్): వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మెదక్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు బి.కొండల్‌రెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం డిమాండ్ చేశారు. టేక్మాల్ మండలం దనూర, మల్కాపూర్, దాదాయిపల్లి గ్రామంలో ప్రజా, రైతు సంఘాల నాయకుల బృందం పర్యటించి ఎండిపోయిన వరి, పత్తి పంటలను పరిశీలించారు. పొలాల్లో పర్యటిస్తూ రైతులతో నేరుగా మాట్లాడి సాగు పరిస్థితులు, పెట్టుబడులు, పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...పంటల సాగు కోసం అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని, ఆశించినస్థాయిలో వర్షాలు లేకపోవడంతో పంటలు చేతికందకుండానే ఎండిపోయాయని రైతులు వాపోయారన్నారు. పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని పేర్కొన్నారు. పంట నష్టపరిహారం పంపిణీలో కౌలు రైతులను విస్మరించరాదని, సాగు చేసి న ప్రతీ రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులు నేరుగా పొలాల్లోకి వెళ్లి పంటల వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని కోరారు. కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక నాయకులు హైమద్, రైతు స్వరాజ్య వేదిక నాయకులు భాగయ్య, టీఆర్‌ఎస్ నేత భట్టి అజయ్, ఆయా సంఘాల నేతలు భాగ య్య, నాగరాజు, సురేందర్‌రెడ్డి రైతులు మంగలి బాల కిష్టయ్య, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


