● మృత్యువాత పడుతున్న వాహనదారులు ● రోజురోజుకీ పెరుగుతున్న చలి తీవ్రత ● ఉదయం 8:00 దాటినా తగ్గని పొగమంచు
సంగారెడ్డి జోన్: శీతాకాలం కావడంతో కొన్ని రోజులుగా ఉదయం 8 గంటలు దాటినా పొగ మంచు తీవ్రత తగ్గటం లేదు. చలి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. అయితే వేకువజామున ప్రయాణించే వాహనదారులు పొగమంచుతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల ప్రమాదాలకు కూడా గురవుతున్నారు. ఇటీవల న్యాల్కల్ మండల పరిధిలోని న్యామతాబాద్ చౌరస్తాలో పొగమంచు కారణంతో రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు మృత్యువాత పడటమే ఇందుకు నిదర్శనం.
తప్పని ప్రయాణం..
వివిధ పరిశ్రమల్లో పనిచేసే వారు, కూలీలు, పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు, వర్తక, వ్యాపారస్తులకు ప్రయాణాలు తప్పడం లేదు. వాహనాలపై వెళ్లే క్రమంలో పొగమంచు కారణంతో లైట్లు వేసుకుంటున్నారు. దగ్గరకు వచ్చేంతవరకు ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించటం లేదు. పొగమంచు ఎక్కువగా ఉండటంతో భారీ వాహనాలు రోడ్డు పక్కన నిలిపి ఉంచుతున్నారు. ఒక్కసారిగా వాహనాలు కనిపించడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటీవల న్యాల్కల్ మండల పరిధిలోని న్యామతాబాద్ చౌరస్తాలో పొగ మంచు కారణంతో రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు మృత్యువాత పడ్డారు. అదేవిధంగా వివిధ ప్రాంతాలలో ప్రమాదాలు జరిగి స్వల్ప గాయాలతో బయటపడుతున్నారు.


