టేక్మాల్(మెదక్): మండలంలోని గొల్లగూడెం గ్రామంలో యాదవ సోదరుల ఆధ్వర్యంలో సదర్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దున్నపోతుల విన్యాసాలు, సంప్రదాయ ఆటపాటలు, డప్పు చప్పుళ్లతో గ్రామంలో పండుగ సందడి నెలకొంది. దీపావళి అనంతరం యాదవులు పశుసంపదను పూజిస్తూ సదర్ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా దున్నపోతులను రంగురంగుల వస్త్రాలు, పూలదండలు, గజ్జెలతో అలంకరించి గ్రామ వీధుల్లో ఊరేగించారు. యువకులు కోలాటం, ఒగ్గు డోలు నృత్యాలతో సందడి చేశారు. దున్నపోతుల విన్యాసాలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ వేడుకల్లో సర్పంచ్ సుధాకర్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు భక్తుల వీరప్ప, జిల్లా బీఆర్‌ఎస్ యువత కార్యదర్శి నాయికోటి భాస్కర్, మాజీ ఎంపీటీసీ సిద్ధయ్య, డైరెక్టర్ కిషన్, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.


