● మున్సిపాలిటీల్లో కొరవడిన నిర్వహణ
● చోద్యం చూస్తున్న అధికారులు
● అడుగంటుతున్న భూగర్భజలాలు
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కనుమరుగయ్యాయి. భూగర్భజలాలు క్రమంగా పడిపోతున్నాయి. దీనికి తోడు నీటిని యథేచ్ఛగా తోడేస్తున్నారు. తిరిగి నీటిని ఇంకించడంలో అధికారులు విఫలమవుతున్నారు. తాగునీటి ముప్పు తరుముకొస్తున్న నేపథ్యంలో దానిని అధిగమించేందుకు ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. నూతన ఇంటి నిర్మాణాలు చేపడుతున్న యజమానులు తప్పనిసరిగా ఇంకుడు గుంతలు నిర్మించాలనే నిబంధన ఉన్నా, జిల్లాలో అమలు కావడం లేదు. – మెదక్‌జోన్
మెదక్ బల్దియా ఏడు దశాబ్దాల క్రితం ఏర్పాటైంది. ప్రస్తుతం 13 వేల పైచిలుకు నివాస గృహాలు ఉండగా, కేవలం 64 ఇంకుడు గుంతలు మాత్రమే ఉన్నాయి. 80 వేలపైచిలుకు జనాభా ఉండగా, సుమారు 9 వేల వరకు బోరుబావులు ఉన్నాయి. మిషన్ భగీరథ నీటిని సంపుల్లో నిల్వ చేస్తూ నిత్యం బోర్లు నడిపించి ఇంటిపై ఉన్న ట్యాంకులకు నీటిని ఎక్కిస్తారు. కాగా, ఈఏడాది ఎల్‌నినో ప్రభావంతో అడపాదడపా వర్షాలు కురిసినా, సీసీ రోడ్లు, సిమెంట్ మురికి కాలువల పుణ్యమా అని చుక్కనీరు భూగర్భంలోకి ఇంకడం లేదు. అలాగే మెదక్ పట్టణాన్ని ఆనుకొని ఉన్న చెరువులు, కుంటలు నిండుకున్నాయి. ఫలితంగా భూగర్భజలాలు వేగంగా పడిపోతున్నాయి.
అమలు కాని నిబంధనలు
నూతనంగా ఇళ్లు నిర్మించే వారు ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. నిర్మించని ఇంటికి అనుమతులు ఇవ్వొదనే నిబంధన ఉంది. కానీ ఏ ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించటం లేదు. జిల్లాలోని మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ నాలుగు మున్సిపాలిటీలుండగా, అన్నింట్లో ఇదే పరిస్థితి నెలకొంది. భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే సమయంలో ప్రతి చదరపు మీటర్‌కు రూ. 15 నుంచి రూ.20 చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒక్కో ఇంటి నిర్మాణంలో భాగంగా ప్రత్యేకంగా ఇంకుడు గుంత నిర్మాణానికి రూ. 2 వేల నుంచి విస్తీర్ణాన్ని బట్టి రూ. 2,500 వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక ఇంకుడు గుంతను నిబంధన ప్రకారం నిర్మిస్తే అప్పుడు ఆ డిపాజిట్ డబ్బును తిరిగి ఇంటి యజమానికి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ పట్టణాల్లో ఇలాంటి నిబంధనలు ఎక్కడా అమలు చేయటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మూలుగుతున్న డిపాజిట్లు
మెదక్ బల్దియాలో మొత్తం 13 వేల పైచిలుకు ఇళ్లు ఉండగా, కేవలం 64 ఇళ్లల్లో మాత్రమే ఇంకుడు గుంతలు ఉన్నాయి. ఏటా వందలాది ఇళ్లు నిర్మిస్తున్నా ఇంకుడు గుంతలు మాత్రం నిర్మించటం లేదు. ఒక్కో ఇంటికి గుంతలకు సంబంధించి రూ. 2 వేల పైచిలుకు చేస్తున్న డిపాజిట్ అధికారుల వద్దే మూలుగుతున్నాయి. ఈ విషయమై అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించటం వల్లే లక్ష్యం నెరవేరకుండా పోతుందనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రయోజనాలెన్నో..
ఇంకుడు గుంతలతో అనేక ప్రయోజనాలున్నాయి. వర్షపు నీరు భూమిలోకి ఇంకడం వల్ల చేతిపంపుల్లో నీటి లభ్యత పెరుగుతుంది. ఫెయిల్ అయిన బోరుబావుల్లో సైతం నీటిమట్టం పెరుగుతుంది. బోరుపక్కనే ఇంకుడు గుంత తవ్వితే అందులో నీరు పుష్కలంగా పెరిగి, సదరు గుంతలతో బోరులో నీటి ఊటలు ఎత్తిపోకుండా నిరంతరం నీరు లభిస్తుంది.
ఆదేశాలు జారీ చేశాం
ఎల్‌నినో నేపథ్యంలో ఇటీవల బిల్డర్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాం. సిమెంట్ నిర్మాణాలకు నీటి క్యూరింగ్ లేని టెక్నాలజీని వాడాలని, నూతనంగా నిర్మించే ప్రతి ఇంటికి ఇంకుడుగుంతలు నిర్మించాలని ఆదేశించాం. అలాగే ప్రతి ఇంటికి 2–3 మొక్కలు నాటాలని చెప్పాం. ఇవి అమలయ్యే విధంగా చర్యలు చేపడతాం.
– నవీన్, మెదక్ మున్సిపల్ కమిషనర్


