కలెక్టర్ ప్రతిమాసింగ్
కొల్చారం(నర్సాపూర్): ఇందిరమ్మ పథకం ద్వారా పేదల సొంతింటి కలను నిజం చేస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. ఆదివారం మండలంలోని కిష్టాపూర్లో లత– సంతోశ్ నూతన గృహంలో నిర్వహించిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. లబ్ధిదారులతో కలిసి పటాకులు కాల్చారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లల్లో గృహ ప్రవేశం చేసిన లబ్ధిదారుల కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసాన్ని అందించేందుకు జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని వివరించారు. ఇందిరమ్మ ప్రత్యేక యాప్ ద్వారా ప్రతి లబ్ధిదారు ఇందిరమ్మ గృహంలో తాము నిర్వహించిన సంబురాల ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ స్వప్న, ఉప సర్పంచ్ నిర్మల, మాజీ సర్పంచ్ గోదావరి, కాంగ్రెస మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశంగౌడ్, హౌసింగ్ ఏఈ సుష్మ తదితరులు పాల్గొన్నారు.


