పసి బిడ్డలను వదిలేయకండి | - | Sakshi
Sakshi News home page

పసి బిడ్డలను వదిలేయకండి

Nov 6 2026 11:27 AM | Updated on Nov 6 2026 11:27 AM

పసి బిడ్డలను వదిలేయకండి కలెక్టరేట్‌కు చేరిన కుట్టు మిషన్లు రాష్ట్రస్థాయిలో మెదక్‌ జట్టు సత్తా ఖోఖో విజేతగా జక్కపల్లి మోడల్‌ స్కూల్‌

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

మెదక్‌ కలెక్టరేట్‌: ప్రతిబిడ్డ జీవితం అమూల్యమైందని.. పుట్టిన బిడ్డలను అనాథలుగా వదిలేసి వారి భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టొద్దని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరిస్థితి ఏదైనా కావొచ్చు, ప్రతీ బిడ్డకు జీవించే హక్కు ఉందన్నారు. బిడ్డను పెంచలేని పరిస్థితి ఉంటే వెంటనే మహిళా, శిశు సంక్షేమ శాఖను సంప్రదించాలన్నారు. పిల్లలను అప్పగించే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డలను చెత్తకుప్పల పాలు చేయొద్దని సూచించారు. అలాగే జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి, విద్యుత్‌ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున రైతులంతా వరికి బదులు ఆరుతడి పంటలు వేసుకోవాలని కలెక్టర్‌ తెలిపారు. అందుబాటులో ఉన్న నీటి వనరులు, భూగర్భజలాల లభ్యతను అంచనా వేసుకున్న తర్వాతే పంటల సాగు చేపట్టాలని స్పష్టం చేశారు.

త్వరలోనే లబ్ధిదారులకు పంపిణీ

మెదక్‌ కలెక్టరేట్‌: గత కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న మహిళల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. గతేడాది అర్హులైన ముస్లిం, మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు అందజేసేందుకు అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీంతో మెదక్‌, నర్సాపూర్‌ నియోజకవర్గాల నుంచి సుమారు 2 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. ఎట్టకేలకు అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో మెదక్‌ నియోజకవర్గంలోని 250 మంది లబ్ధిదారులకు అందజేసేందుకు ప్రభుత్వం కుట్టు మిషన్లు సిద్ధం చేసింది. త్వరలోనే ఎమ్మెల్యే రోహిత్‌రావు చేతుల మీదుగా అందజేయనున్నారు. అయితే వీటిని మండలాల వారీగా తరలించి అక్కడే లబ్ధిదారులకు అందజేయనున్నట్లు జిల్లా మైనార్టీ వెల్ఫేర్‌ ఇన్‌చార్జి అధికారి ఉపేందర్‌ తెలిపారు. కాగా, నర్సాపూర్‌ నియోజకవర్గంలో 175 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ వారికి అందజేసేందుకు ఇంకా కుట్టు మిషన్లను ప్రభుత్వం సరఫరా చేయలేదని తెలిసింది.

చేగుంట(తూప్రాన్‌): ఖేలో ఇండియా అస్మిత రగ్బీ రాష్ట్రస్థాయి పోటీల్లో మెదక్‌ జిల్లా జట్టు విజయం సాధించి మొదటి స్థానంలో నిలిచిందని గురువారం కోచ్‌ కరణం గణేశ్‌ రవికుమార్‌ తెలిపారు. ఈనెల 3, 4, 5 తేదీల్లో సంగారెడ్డి జిల్లాలోని వోక్సెన్‌ యూనివర్సిటీలో రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో అండర్‌–18 బాలికల విభాగంలో 12 జిల్లాలకు చెందిన క్రీడాకారుల పాల్గొనగా, మెదక్‌ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. రెండో స్థానంలో నల్లగొండ, మూడోస్థానంలో ఖమ్మం జిల్లా జట్టు నిలిచిందన్నారు. ఈపోటీల్లో ఇండియా అబ్జర్వర్‌ నోయెల్‌ మ్యాత్యూ, డాక్టర్‌ అర్జున్‌ ప్రసాద్‌, రాంబాబు, టెక్నికల్‌ ఇన్‌చార్జి సాయిచరణ్‌, రాష్ట్ర రగ్బీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఆదిత్య, యూనివర్సిటీ స్పోర్ట్స్‌ ఇన్‌చార్జి విజయ్‌ పాల్గొన్నారు.

నర్సాపూర్‌ రూరల్‌: జిల్లాస్థాయి ఖోఖో విజేతగా మండలంలోని జక్కపల్లి మోడల్‌ స్కూల్‌ నిలిచింది. ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు మెదక్‌లో జరిగిన జిల్లాస్థాయి పీఎంశ్రీ క్రీడల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచారు. ఈసందర్భంగా విద్యార్థులను స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ఫర్హానా, పీడీ అశోక్‌ కుమార్‌, అధ్యాపకులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement