● కరెంట్ మోటార్ ఏర్పాటు చేసి చౌర్యం
● దర్జాగా ‘వాల్టా’కు తూట్లు
● పట్టించుకోని అధికారులు
నర్సాపూర్: పంట పొలాలకు నీరివ్వడానికి అనుమతులు లేవంటున్న అధికారులు ఓ రిసార్ట్ నిర్వాహకులు చెరువు నీటిని అక్రమంగా వాడుకుంటున్నా చర్యలు తీసుకోవడం లేదు. ‘వాల్టా’ను దర్జాగా ఉల్లంఘిస్తున్నా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపాలిటీకి చెందిన రాయరావు చెరువును ఆనుకొని ఉన్న అటవీ భూమిలో ఓ వ్యాపార సంస్థ ‘అనమ్‌కార’ పేరుతో కాటేజీలు నిర్మించి అద్దెకు ఇస్తుంది. కాటేజీల కింద నీరుండే విధంగా వాటి నిర్మాణం చేపట్టారు. సొంత బోర్ల నుంచి నీటిని తోడి కాటేజీల కింద నీరు నింపాల్సి ఉండగా, చెరువులో అక్రమంగా కరెంట్ మోటార్ పెట్టి పైపులైన్ ద్వారా నీటిని నింపుతున్నారు. చెరువుపై ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ కరువైందని పలువురు ఆరోపిస్తున్నారు.
మొక్కుబడిగా చర్యలు
రాయరావు చెరువులో కరెంట్ మోటారు ఏర్పాటుచేసి పైపులైన్ ద్వారా నీటిని రిసార్ట్‌కు సరఫరా చేస్తున్న వీడియోలు గురువారం సోషల్ మీడియాలో కొందరు రైతులు పోస్టు చేశారు. అంతేగాక చెరువు నీటిని అక్రమంగా వ్యాపార సంస్థ వాడుకుంటుందని మున్సిపల్ కమిషనర్, నీటి పారుదల శాఖ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైతులు పోస్టులతో పాటు ఫిర్యాదు చేయడంతో ఇరిగేషన్ అధికారులు స్పందించారు. తమ సిబ్బందితో పాటు ఇతర శాఖల సిబ్బందిని కాటేజీల వద్దకు పంపి మోటార్ స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించారు. అయితే నిర్వాహకులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిసింది.
చర్యలు తీసుకుంటాం: ఇరిగేషన్ ఏఈ
రాయరావు చెరువు నుంచి రిసార్ట్ నిర్వాహకులు నీటిని వాడుకుంటున్న విషయం తమకు తెలియదని ఇరిగేషన్ ఏఈ సునీత తెలిపారు. రైతులు ఫిర్యాదు చేయడంతో తమ సిబ్బందిని పంపి కరెంట్ మోటార్ స్వాధీనం చేసుకుని పోలీసుల ఆధీనంలో ఉంచినట్లు చెప్పారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చానని, వారి సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.


