అదనపు కలెక్టర్ నగేశ్
మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఈ–హెచ్‌ఆర్‌ఎంఎస్ విధానాన్ని అన్నిశాఖల్లో సమర్థవంతంగా అమలు చేసేందుకు పటిష్ట చర్యలు తీసు కుంటున్నామని అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. ఈ నూతన విధానంపై గురువారం కలెక్టరేట్‌లో అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు రికార్డులు, వ్యక్తిగత వివరాలు, సేవా సంబంధిత కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ వి ధానం అమలు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా ఖజానా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అనిల్ కుమార్ నూతన విధానం అమలుకు సంబంధించిన అంశాలను వివరించారు. అనంతరం జిల్లా సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ అధికారి ఏడీ కిషన్ ఆధ్వర్యంలో భూముల రీ సర్వే ప్రక్రియపై లైసెన్స్ సర్వేయర్లతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ పలు కీలక సూచనలు చేశారు. భూ రీ సర్వే ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవినీతికి తావులేకుండా, అత్యంత పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అధికారులు, సర్వేయర్లు పాల్గొన్నారు.


