ఎల్‌నినో నేపథ్యంలో అన్నిశాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా మున్సిపాలిటీల్లో ఇంకుడు గుంతల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. కొత్తగా ఎవరైనా ఇల్లు నిర్మించుకోవాలంటే ఇంకుడు గుంత నిర్మించాల్సిందే. గతంలో ఈ నిబంధన ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వృథా నీటిని భూమి లోపలికి పంపి భూగర్భజలాలు పెంపొందించే విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. – రామాయంపేట(మెదక్)
రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 5,620 పైగా నివాస గృహాలున్నాయి. గతంలోనే నిర్మించుకున్న ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు లేవు. కొత్తగా నిర్మిస్తున్న గృహాల వద్ద విధిగా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాల్సిందేనని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం ప్రక్రియను ఉపాధి ప్రణాళికలో చేర్చారు. ఒక్కో ఇంకుడు గుంత నిర్మాణానికి గాను రూ.7 వేల వరకు ఇస్తున్నారు. ప్రస్తుతం పట్టణంలో 95 శాతానికి పైగా ఉన్న గృహాల వద్ద ఇంకుడు గుంతలు లేవు. ఇటీవల మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో అధికారులు సర్వే నిర్వహించి నివాసాలను గుర్తించారు. గుంత నిర్మించుకోకపోతే నల్లా కనెక్షన్ తొలగిస్తామని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ప్రైవేట్ స్కూళ్లు, రైసు మిల్లుల్లో
జిల్లావ్యాప్తంగా రైస్ మిల్లులు, ప్రైవేట్ కాలేజీలు, ఫంక్షన్ హాళ్లు, ప్రైవేట్ స్కూళ్ల వద్ద విధిగా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని తాజాగా మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు ఆయా మున్సిపాలిటీ కమిషనర్లు వారికి నోటీసులు జారీ చేశారు. తమ ఆదేశాలు బేఖాతర్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఉపయోగాలు
● ఇంకుడు గుంతల నిర్మాణంతో భూమిలో నీటి మట్టం పెరుగుతుంది.
● వర్షం నీరు ఇంకుడు గుంతల్లోకి మళ్లిస్తే వరదలు తగ్గడంతో పాటు రోడ్డుపై వరద నీరు నిలవదు.
● కాలుష్య నివారణతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఇవి తోడ్పడుతాయి.
● గుంతల్లో నీరు నిల్వ లేకుంటే దోమల బెడద అరికట్టవచ్చు. వాటివల్ల సంక్రమించే వ్యాధులను నియంత్రించవచ్చు.
● ఆరోగ్యకరమైన సమాజానికి ఇంకుడు గుంతలు ఎంతో ఉపయోగపడతాయి.
బల్దియాలో ఇలా..
పట్టణంలో ఇళ్లు: 5,620
ప్రస్తుతం ఇంకుడు గుంతలు: 30
అధికారుల ముందస్తు జాగ్రత్త చర్యలు
‘పేట’ బల్దియాలో ఇంకుడుగుంతలకు కార్యాచరణ
రైస్‌మిల్లులు, ఫంక్షన్ హాళ్లు, ప్రైవేట్ స్కూళ్లలో తప్పనిసరి


