కలెక్టర్ ప్రతిమాసింగ్
టేక్మాల్(మెదక్): భూ భారతి రీ సర్వేతో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు. టేక్మాల్ మండలంలోని ఏక్లాస్‌పూర్‌లో గురువారం నిర్వహించిన భూ భారతి రీ సర్వే గ్రామసభలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. భూ భారతి రీ సర్వే గురించి అపోహలు వద్దని, రీ సర్వే వల్ల గ్రామంలోని భూములకు పటిష్టంగా హద్దులు నిర్ణయించనున్నామన్నారు. గ్రామంలో ఉన్న 718 ఎకరాల్లో సర్వే నిర్వహించి ఎలాంటి భూ సమస్యలు ఉన్నా 60 రోజుల ముందు నోటీసులు ఇచ్చి పరిష్కరిస్తామని గ్రామస్తులకు అభయమిచ్చారు. ముందుగా గ్రామ సరిహద్దులు, గ్రామకంఠం, ఫారెస్ట్, అసైన్డ్, చెరువు,కుంట భూముల అనంతరం పట్టా భూములను సర్వే నిర్వహించి భూ తగాదాలు లేకుండా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, స్థానిక తహసీల్దార్ తులసీరామ్, సర్పంచ్ యశోద, ఎంపీడీఓ సత్యనారాయణ, ఏఓ రాం ప్రసాద్, ఎంపీఓ రియాజొద్దిన్ తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన
విద్యను అందించాలి
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. టేక్మాల్ మండల కేంద్రంలోని ప్రభుత్వం జూనియర్ కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల సామర్థ్యాలను, నిర్మాణంలో ఉన్న సైన్స్ ల్యాబ్‌లను పరిశీలించారు. పాఠశాల, కళాశాలలో విద్యాబోధనతీరు, హాజరు, మౌలిక వసతులు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం, హాస్టల్ వసతులు, ల్యాబ్ సౌకర్యాలను పరిశీలించారు. ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు తదితర విద్యుత్ పరికరాలు సక్రమంగా పనిచేసేలా చూడాలని, మరమ్మతులు అవసరమైన వాటిని వెంటనే బాగు చేయించాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ తులసీ రామ్, ప్రిన్సిపాల్ శరత్‌చంద్ర, అధ్యాపకులు తదితరులున్నారు.


