● జోరుగా సాగుతున్న వరికోతలు
● సన్నాలు కొనుగోళ్లు చేస్తున్న వ్యాపారులు
● తుపాన్ హెచ్చరికతో ఆందోళన చెందిన రైతులు
ఎల్‌నినో ప్రభావంతో వానలు అంతంత మాత్రంగానే వర్షాలు కురవడంతో సాగుచేసిన వరి పంటకు సరిపడా నీటితడులు అందలేదు. దీనికి తోడు కరెంట్ సైతం సక్రమంగా సరఫరా జరగక చాలావరకు పంటలు ఎండిపోయాయి. దీంతో అనేక వ్యయప్రయాసలకోర్చి జనరేటర్లు, ట్యాంకర్ల ద్వారా సాగునీటిని అందించి పంటను దక్కించుకున్నారు. తీరా పంట కోత దశలో ఉన్న సమయంలో ‘అర్నబ్’తుపాన్ హెచ్చరికలు అన్నదాతలను ఆందోళనకు గురిచేసింది. దీంతో ఎక్కడికక్కడ రైతులు హడావుడిగా వరికోతలు ప్రారంభించారు. –మెదక్‌జోన్
జిల్లాలో ఈ ఏడాది 3.40 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయగా అందులో 2.94 లక్షల ఎకరాలకు పైగా వరి పంటను సాగు చేశారు. కాగా, అధికారుల అంచనా ప్రకారం ఎకరాకు 25 క్వింటాళ్ల చొప్పున ధాన్యం దిగుబడి వస్తుందని దీంతో 7.35 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రావాల్సి ఉంటుంది. రావాల్సిన దిగుబడిలో 50 వేల మెట్రిక్ టన్నుల వరకు తగ్గుతుందని సంబంధిత వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయినప్పటికీ 6.85 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రానుంది. ఈ నేపథ్యంలో ఎల్‌నినో ప్రభావం రెండేళ్లపాటు ప్రతికూల పరిస్థితి ఉందని శాస్త్రవేత్తల హెచ్చరికలతో వ్యాపారులు రెక్కలు కట్టుకుని పంటపొలాల్లో వాలిపోయారు.
సన్నధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.3,200 నుంచి రూ.3,500 చొప్పున వెచ్చించి కొనుగోళ్లు చేస్తున్నారు. ఇది రైతుకు లాభదాయకమనే చెప్పాలి.
భయపెట్టిన ‘అర్నబ్’తుపాన్
ఈ ఏడాది 518 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా రైతుల నుంచి ధాన్యం సేకరించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సన్నాలకు ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకన్నా ఎక్కువగా చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేస్తుండగా, ఎల్‌నినో ముప్పు రానున్న కాలంలో ఏవిధంగా ఉంటుందోననే భయంతో రైతులు తినడానికి పెద్ద మొత్తంలో సన్న ధాన్యం నిల్వ ఉంచుకుంటున్నారు. కాగా, ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలను అధికారులు ఎక్కడా ఏర్పాటు చేయలేదు. అర్నబ్ తుపాన్ ప్రభావం జిల్లాపై పడింది. గత 3 రోజులుగా చలితీవ్రత పెరగటంతోపాటూ ఈదురుగాలులు వీచాయి. ఆకాశంలో మేఘాలు వర్షించే విధంగా నల్ల మబ్బులు కమ్ముకున్నాయి. దొడ్డు ధాన్యాన్ని మిల్లరు కొనుగోలు చేయకపోవటంతో రైతులు రోడ్లు వెంట, పంట పొలాల వద్ద ఆరబెడుతున్నారు. కానీ తుపాన్ కారణంగా ఆరబెట్టిన ధాన్యం తడిసి పోతుందేమోనని ఆందోళన చెందారు. ఇప్పటికై నా కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ఏర్పాటు చేసి కొనాలని పలువురు కోరుతున్నారు.


