జిల్లాలోని మూడు మండలాల్లో
లోటు వర్షపాతం నమోదు
కరువుగా చూపించింది ఒకే మండలం
అధికారుల తీరుపై ఆగ్రహం
మండిపడుతున్న
బాధిత మండలాల ప్రజలు
కరువును కప్పి పుచ్చిన అధికారుల తీరుతో బాధిత అన్నదాతలకు తీరనినష్టం కలిగే పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో మూడు మండలాల్లో లోటువర్షపాతం నమోదు కాగా కేవలం ఒకే ఒక్క మండలాన్ని కరువుగా ప్రకటించటం అధికారుల పనితీరుకు అద్దపడుతోంది. ఫలితంగా బాధిత మండలాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
– మెదక్‌జోన్
మెతుకు సీమలో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ ఖరీఫ్‌లో 4 మాసాల్లో రెండు నెలల్లో లోటువర్షపాతం నమోదు కాగా మరో 2 నెలల్లో సాధారణవర్షం కురిసింది. దీంతో మొత్తంగా సాధారణ వర్షపాతం నమోదైంది. కానీ కురవాల్సిన సమయంలో వర్షం కురవకపోవటంతో సాగుచేసిన పంటలకు సకాలంలో నీటితడులు అందక జరగాల్సిన నష్టం జరిగింది. అంతేకాకుండా జిల్లాలో మూడు మండలాల పరిధిలో సాధారణ వర్షపాతం కన్నా తక్కువగా నమోదైంది. కానీ ఒకే మండలాన్ని కరువుగా ప్రకటించటంతో మిగతా రెండు మండలాల రైతులు ఆందోళన చెందుతున్నారు.
2 నెలల్లో లోటు, 2 నెలల్లో సాధారణం!
ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో చెప్పుకోదగ్గ వర్షాలు కురవలేదు. ముఖ్యంగా ఖరీఫ్ ప్రారంభంలోని జూన్‌లో అధికారిక లెక్కల ప్రకారం 112.4 మి.మీటర్ల వర్షం పడాల్సి ఉండగా కేవలం 83.8 మి.మీటర్లు మాత్రమే నమోదైంది. దీంతో 28.6 మి. మీటర్లు తక్కువగా నమోదైంది. వానాకాలం మొదటి నెలనే కీలకం కాగా అదే నెలలో ఆరుతడి పంటలతో పాటూ నారుమళ్లు పోస్తారు. లోటు వర్షం కురవటంతో నారుమళ్లు ఎండిపోయాయి. ఆరుతడి పంటలదీ సైతం అదే పరిస్థితి. అనంతరం జూలైలో 206.6 మి.మీటర్లు సాధారణ వర్షపాతం కాగా 289.2మి.మీటర్ల వర్షం కురిసింది. ఆగస్టులో 199.4 సాధారణ వర్ష పాతం కాగా 210.6 మి.మీటర్ల వర్షం కురిసింది. సెప్టెంబర్‌లో 154.7 మి.మీటర్లు సాధారణం కాగా కురిసింది మాత్రం 140 మి.మీటర్లు మాత్రమే. ఈ లెక్కన 14.7 మి. మీటర్లు తక్కువగా నమోదైంది. ఈ నేపథ్యంలో వర్షాకాలంలోని జూన్, సెప్టెంబర్ నెలల్లో లోటు వర్షపాతం నమోదు కాగా జూలై, ఆగస్టు మాసాల్లో సాధారణ వర్షపాతం కురిసింది. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 497 మి. మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా పడింది 580 మి.మీటర్లుగా నమోదైంది.
మూడు మండలాల్లో లోటు వర్షం!
మెదక్ జిల్లాలో 21 మండలాలు ఉండగా 18 మండలాల్లో సాధారణ వర్ష పాతం నమోదు కాగా 3 మండలాల్లో మాత్రం సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. వర్షాకాలం ప్రారంభం నుంచి ఆ మూడు మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. అందులో నర్సాపూర్‌లో 718 మి.మీటర్లు సాధారణం కాగా, పడింది మాత్రం 596 మి.మీటర్లు మాత్రమే ఈ లెక్కన 122 మి.మీటర్లు తక్కువగా పడింది. అలాగే చిలప్‌చెడ్ 659 మి.మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 449 మి.మీటర్ల వర్షం మాత్రమే నమోదైంది. దీంతో 210 మి. మీటర్ల వర్షం తక్కువగా నమోదైంది. అలాగే మనోహరాబాద్ మండలంలోనూ 723.6 మి. మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 673.1 మి.మీటర్ల వర్షం మాత్రమే నమోదైంది. దీంతో 50.5 మి. మీటర్ల వర్షం పాతం తక్కువగా నమోదైంది.
కరువుగా ఒకే మండలం ప్రకటన...!
జిల్లాలోని 21 మండలాలు ఉండగా నర్సాపూర్, చిలప్‌చెడ్, మనోహరబాద్ మండలాల్లో లోటు వర్ష పాతం నమోదైనప్పటికీ కేవలం మనోహరబాద్ మండలాన్ని మాత్రమే కరువు మండలాల జాబితాలో చేర్చారు. ఇది అధికారుల తప్పిదమా...? లేక మరేమైనా కారణమా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవ పరిస్థితిని కప్పి పుచ్చి మండలాలను కరువుకు మినహాయించటంపై ప్రజలు మండి పడుతున్నారు.
వేగంగా పడిపోతున్న జలం...!
జిల్లాలో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నా యి. గతేడాది అక్టోబర్‌లో మొత్తంగా 7.84 మీటర్ల లోతులో ఉండగా ఈ ఏడాది అక్టోబర్‌లో 11.48 మీటర్ల లోతులోకి పడిపోయింది. గతేడాదితో పోలిస్తే ఏకంగా 3.64 మీటర్ల లోతులోకి పడిపోవటం చూస్తుంటే ఎంత వేగంగా భూగర్భ జలాలు పడిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.
సగానికి పైగా ఎండిన పంటలు!
సరైనా వర్షాలు కురవక పోవటంతోపాటు వ్యవసాయానికి కరెంట్ సైతం సరిగ్గా సరఫరా ఇవ్వలేదు. జిల్లాలో చాలావరకు వరిపంటలు ఎండిపోయాయి. కొందరు రైతులు జనరేటర్లను అద్దెకు తెచ్చి బోరుబావుల ద్వారా నీటితడులు అందించారు. ఇందులో ప్రధానంగా నర్సాపూర్, చిలప్‌చెడ్, మనోహరబాద్ మండలాల్లో సగానికిపైగా పంటలు ఎండిపోయాయి. అయినప్పటికీ కేవలం మనోహరబాద్‌ను మాత్రమే కరువుగా చూపించి మరో రెండు మండలాలను కరువు జాబితాలో ప్రకటించకపోవటంతో ఆందోళన చెందుతున్నారు.


