● పదేళ్లుగా నిరుపయోగంగా గజబో ● త్వరలో వినియోగంలోకి తెస్తామంటున్న అధికారులు
నర్సాపూర్: అటవీశాఖ అధికారులు సుమారు రూ.12 లక్షల ప్రభుత్వ నిధులతో సుమారు పదేళ్ల క్రితం నిర్మించిన గజబో నిరుపయోగంగా మారింది. అటవీ శాఖ నర్సాపూర్ రేంజ్‌లోని కొండాపూర్ బీట్ పరిధిలో నర్సాపూర్ హైదరాబాద్ రహదారి నుంచి కొంతదూరంలోని అడవిలోకి వచ్చే సందర్శకులు అటవీ అందాలు వీక్షిస్తూ సేదతీరడంతోపాటు భోజనాలు చేసేందుకు అనువుగా గజబోను దానిపక్కన చెక్‌డ్యామ్‌ను నిర్మించారు. ఇక చెక్ డ్యామ్‌ను ఆనుకుని కూర్చునేందుకు వీలుగా ఆకర్షణీయమైన టేబుల్, స్టూళ్లు లాంటివి సిమెంట్‌తో పెద్ద బండరాయిపై నిర్మించారు.
పదేళ్లుగా నిరుపయోగం
పచ్చని అడవిలో సందర్శకులను ఆకర్షించే విధంగా రూ.12లక్షలతో నిర్మించిన గజబో ఇతర నిర్మాణాలు పదేళ్లుగా నిరుపయోగంగానే ఉంటున్నాయి. కాగా, కొండాపూర్ బీట్ పరిధిలో నిర్మించిన గజబో వైపు సందర్శకులను అనుమతించడం లేదు. గజబో నిర్మించిన ప్రాంతం వైపు వెళ్లాలంటే జాతీయ రహదారి సమీపంలో ఏర్పాటు చేసిన గేట్‌కు తాళం వేసి ఉండటంతో సందర్శకులు వెళ్లడానికి వీలు పడటం లేదని తెలిసింది. కాగా స్థానిక అటవీ శాఖ రేంజ్ పరిధిలో నిర్మించిన అర్బన్ పార్కులోకి సందర్శకులను అనుమతించిన విధంగా గజబో ఉన్న ప్రాంతంలోకి సైతం సందర్శకులను అనుమతించి గజబో ఇతర నిర్మాణాలు వినియోగంలోకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


