తాజా, మాజీ సర్పంచుల మధ్య తగాదాలు పాతవారు అభివృద్ధికి వెచ్చించిన నిధులు అందనివైనం పంచాయతీ కార్యదర్శులదీ అదే దుస్థితి ప్రేక్షకపాత్ర వహిస్తున్న జిల్లా స్థాయి అధికారులు
చేటలో తవుడు పోసి పిల్లులకు పంచాయితీ పెట్టినట్లు ఉంది ఆ పంచాయతీరాజ్‌శాఖ అధికారుల తీరు. గ్రామ పంచాయతీల అభివృద్ధితోపాటూ, నిర్వహణకోసం నాటి సర్పంచులుపెట్టిన రూ.కోట్ల బకాయిలు నేటికీ అలాగే ఉన్నాయి. నూతనంగా అధికారంలోకి వచ్చిన సర్పంచులు కొంతముట్టజెప్పినప్పటికీ మరో రూ.4 కోట్ల పైచిలుకు బకాయిలు ఉండటంతో వాటికోసం తాజా, మాజీ సర్పంచులకు మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి.
మెదక్‌జోన్
జిల్లావ్యాప్తంగా 493 గ్రామ పంచాయితీలలో 2023లో పాత సర్పంచుల పదవీకాలం ముగిసింది. వారు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ హయాంలో సర్పంచులు సీసీరోడ్ల నిర్మాణాలు, పారిశుద్ధ్యం, శ్మశానవాటికలు, డంపుయార్డులు, హరితహారం, వీధి దీపాల నిర్వహణ, మురికి కాలువల నిర్మాణాలు, పల్లెప్రకృతి, పంచాయతీ భవనాల నిర్మాణాలు ఇలా పలు అభివృద్ధి పనులకు తమ సొంత నిధులు వెచ్చించారు. కానీ వారికి రావాల్సిన నిధులు రాకుండానే 2023లో పదవీకాలం ముగిసింది. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో సుమారు రెండేళ్ల వరకు పంచాయతీ ఎన్నికలను నిర్వహించలేదు. ఆ సమయంలో గ్రామాలకు ప్రత్యేకాధికారులను నియమించి పంచాయతీల నిర్వహణను గాలికొదిలేశారు. చిన్న పంచాయతీకి నెలకు రూ.3 లక్షల వరకు ఖర్చు చేయగా పెద్ద పంచాయతీలకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేస్తూ రెండేళ్లుగా నెట్టుకొచ్చారు.
తాజా, మాజీల మధ్య గొడవలు!
కొత్త పాలకవర్గం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న నేపథ్యంలో పాత సర్పంచులు అధికారంలో ఉన్నప్పుడు గ్రామాలభివృద్ధికి వెచ్చించిన నిధులను చెల్లించాలని నూతన సర్పంచ్‌లను కోరుతున్నారు. దీంతో కొంతమేర ముట్టజెప్పినప్పటికీ ఇంకా జిల్లావ్యాప్తంగా రూ.5 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. డబ్బులు ఇవ్వాలని అడగటంతో తాజా, మాజీల మధ్య గొడవలు తీవ్రస్థాయికి చేరుతున్నాయి. అంతేకాకుండా రెండేళ్లపాటూ సర్పంచులు లేకపోవటంతో వాటి నిర్వహణ వ్యయాన్ని పూర్తిగా కార్యదర్శులే భరించారు. వారికి సైతం కొంతముట్టజెప్పినప్పటికీ ఇంకా రూ.1.50 కోట్లు ఇవ్వాల్సి ఉంది.
ప్రేక్షక పాత్రలో అధికారులు...!
అభివృద్ధి కోసం వెచ్చించిన నిధులను ఇవ్వాలంటూ పాత, కొత్త సర్పంచులు గొడవలు పడుతున్నా సంబంధిత పంచాయతీరాజ్‌శాఖ అధికారులు మాత్రం ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. పాత, కొత్త ప్రజాప్రతినిధులకు నచ్చజెప్పే ప్రయత్నాలకు ఎవరూ ముందుకు రావడంలేదు.
డిసెంబర్ 2025లో ఎన్నికలు
డిసెంబర్ 2025లో గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగటంతో కొత్త పాలకవర్గం అధికారంలోకి వచ్చింది. దీంతో పాత సర్పంచులు అభివృద్ధికోసం ఖర్చు చేసిన బకాయిలతోపా టు పంచాయతీ కార్యదర్శులు రెండేళ్లపాటూ జీపీల నిర్వహణకు వెచ్చించిన డబ్బులు రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. కాగా, కొత్తగా అధికారంలోకి వచ్చిన సర్పంచులు కొంత చెల్లించినప్పటికీ పూర్తి స్థాయిలో చెల్లించాలని పాతవారు డిమాండ్ చేస్తున్నారు.


