జిల్లా ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ శుభవల్లి
మెదక్‌జోన్: పిల్లల భద్రత ప్రతీఒక్కరి బాధ్యతని జిల్లా ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఆర్.ఎం.శుభవల్లి పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని చైతన్య భారతి హై స్కూల్‌ల్లో సురక్షిత్ బచ్‌పన్ అభియాన్ ఆధ్వర్యంలో పోక్సోపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎలాంటి స్పర్శ వల్ల పిల్లలకు అసౌకర్యంగా లేదా భయంగా అనిపించినా ధైర్యంగా ముందుకు వచ్చి తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేయాలన్నారు. అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సోషల్ మీడియాలో అపరిచితులతో వ్యక్తిగత వివరాలు ఫొటోలు, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు పంచుకోకూడదన్నారు. సైబర్ నేరాల ఫిర్యాదుల కోసం 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ శ్రీమతి రుబీనా ఫాతిమా, పాఠశాల కరస్పాండెంట్ జుబేర్ అహ్మద్ ఎస్సై మాణిక్ ప్రభు తదితరులు పాల్గొన్నారు.
లైంగిక వేధింపులపై
అప్రమత్తం
బాలికలకు జూనియర్ సివిల్ జడ్జి ఉద్బోధ
నర్సాపూర్: బాలికలు లైంగిక వేధింపులపట్ల అప్రమత్తంగా ఉండాలని స్థానిక జూనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ హేమలత సూచించారు. స్థానిక జెడ్పీ ఉన్నత బాలికల పాఠశాలలో సురక్షిత్ బచ్చన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పోక్సో చట్టంపై న్యాయ విజ్ఞాన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి లైంగిక నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పలు చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కాగా విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో లీగల్ సర్వీసెస్ న్యాయవాది రాజునాయక్, ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థినులు
ధైర్యంగా ఉండాలి
సివిల్ జడ్జి సుచరిత
అల్లాదుర్గం(మెదక్): విద్యార్థినులు ధైర్యంగా ఉంటే ఎలాంటి సమస్యలైన ఎదుర్కొనే శక్తి వస్తుందని అల్లాదుర్గం జూనియర్ సివిల్ జడ్జి సుచరిత పేర్కొన్నారు. మండల పరిధిలోని చిల్వెర జెడ్పీ పాఠశాల విద్యార్థులకు చట్టాలపై మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఎవరైనా అస్యభ్యంగా తాకినా, చెడుగా ప్రవర్తించినా ధైర్యంతో ఎదిరించాలని, వెంటనే తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం ఇస్తే చట్టా ప్రకారం చర్యలు తీసుకుంటారన్నారు. విద్యార్థులు క్రమ శిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
జాతీయస్థాయి
రగ్బీ పోటీలకు దివ్య
చేగుంట(తూప్రాన్): జాతీయస్థాయి రగ్బీ పోటీలకు చేగుంట మోడల్ పాఠశాల విద్యార్థిని ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ చంద్రకళ పేర్కొన్నారు. చేగుంట మోడల్ పాఠశాలకు చెందిన పి.దివ్య ఈ నెల 23న జరిగిన అండర్–19 రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ రగ్బీ పోటీల్లో పాల్గొని ప్రతిభను కనబర్చి జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 31 నుంచి ఢిల్లీలో జరిగే జాతీయ రగ్బీ పోటీల్లో దివ్య పాల్గొనన్నుట్లు తెలిపారు. మోడల్ పాఠశాల విద్యార్థిని జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.


