కౌడిపల్లి(నర్సాపూర్): యాసంగిలో రైతులు వరిపంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని స్థానిక ఏడీఏ పుణ్యవతి సూచించారు. మండల కేంద్రమైన కౌడిపల్లిలో మంగళవారం ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించి రైతులను అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ఎల్నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవలేదని రైతులు యాసంగిలో నీటిలభ్యత ఆధారంగా వరి పంటకు బదులుగా ఇతర ఆరుతడి పంటలు, కూరగాయలు, పప్పుదినుసులు సాగుచేయాలని చెప్పారు. అనంతరం కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ...రైతులు ప్రకృతి, సేంద్రియ సాగు చేయాలన్నారు. రైతులు భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలని చెప్పారు. వరి కోతల అనంతరం వరికొయ్యలు, పంట అవశేషాలను కాల్చవద్దని భూమిలో కలియ దున్నాలని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణాగౌడ్, ఉపసర్పంచ్ శ్వేత, ఏఓ స్వప్న, ఏఈఓ సాహితి, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.


