రేషన్‌ డీలర్లకు అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ డీలర్లకు అండగా ఉంటాం

Oct 28 2026 8:18 AM | Updated on Oct 28 2026 8:18 AM

● సమస్యలు పరిష్కారానికి పోరాటం

● మాజీ మంత్రి హరీశ్‌రావు

గజ్వేల్‌: రేషన్‌ డీలర్ల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు వారి పక్షాన పోరాటం చేస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని బింగి ఎల్లయ్య గార్డెన్స్‌లో నిర్వహించిన రేషన్‌ డీలర్ల రాష్ట్రస్థాయి గౌరవ వేతన సాధన సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ హయాంలో రేషన్‌ డీలర్ల ఇబ్బందులను గుర్తించి కమీషన్‌ను క్వింటాలుకు రూ.70నుంచి రూ.140కి పెంచామని గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే రూ.300 కమీషన్‌తోపాటు రూ.5వేల గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ నేడు మాట తప్పిందన్నారు. అందాల పోటీలు, మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్‌ సిటీకి డబ్బులుంటాయి గానీ.. రేషన్‌ డీలర్లకు గౌరవ వేతనం, కమీషన్‌ పెంపునకు డబ్బుల్లేవా? అంటూ ప్రశ్నించారు. జడ్చర్ల ఎమ్మెల్యే, రాష్ట్ర రేషన్‌ డీలర్ల సంఘం గౌరవ అధ్యక్షుడు అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ రేషన్‌ డీలర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. డిమాండ్ల తీరే వరకు అండగా ఉంటానని అన్నారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే, రేషన్‌ డీలర్ల సంఘం మరో గౌరవ అధ్యక్షుడు గూడెం మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ డీలర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు త్వరలోనే హైదరాబాద్‌లో భారీ సభను నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేంతవరకు పోరాటం ఆగదన్నారు. రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి పోరాట కార్యాచరణ చేయనున్నామన్నారు. అవసరమైతే తానూ ఆమరణ దీక్షకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. సభలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, రేషన్‌ డీలర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement