పెద్దశంకరంపేట(మెదక్): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదలకు వరమని జహీరాబాద్ ఎంపీ సురేశ్‌షెట్కార్ అన్నారు. సోమవారం సాయంత్రం మండల పరిధిలోని బుజ్రాన్‌పల్లిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఎంపీ ప్రారంభించారు. పేదల సంక్షేమానికి సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని, ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రా మంలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు జైపాల్‌గౌడ్, రవీందర్, సీనియర్ నాయకులు మధు, విఠల్, మహిపాల్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కౌడిపల్లి(నర్సాపూర్): రైతులను ఆదుకునేలా కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అమ్మవార్లును కోరారు. సోమవారం మండలంలోని తునికి నల్లపోచమ్మదేవిని దర్శించుకున్నారు. అలాగే కౌడిపల్లిలోని దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి దయతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులకు కరెంట్ కష్టాలు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సార రామాగౌడ్, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచ్‌లు పద్మ, ధనలక్ష్మి, మాజీ సర్పంచ్‌లు ఎల్లం, సాయాగౌడ్, మాజీ ఎంపీటీసీ ప్రవీణ్‌కుమార్, నాయకులు నవీన్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలను తక్షణమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో వినతులను స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినతులను తక్షణమే పరిశీలించి పరిష్కరించాలని, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఏఓ యూనస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మెదక్‌జోన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం విజయదశమి పర్వదినాన్ని పురస్క రించుకుని ఆయుధ పూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొని ఆయుధాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి, పోలీసు అధికారులు, సిబ్బందికి జమ్మి అందజేసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పోలీసు వాహనాలకు పూజలు చేశా రు. ఈసందర్భంగా ఎస్పీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.


