పక్కా ప్రణాళికతో రీ సర్వే | - | Sakshi
Sakshi News home page

పక్కా ప్రణాళికతో రీ సర్వే

Oct 13 2026 11:37 AM | Updated on Oct 13 2026 11:37 AM

పక్కా ప్రణాళికతో రీ సర్వే అర్జీలు త్వరగా పరిష్కరించాలి నిష్పక్షపాతంగా విచారణ ఎన్‌హెచ్‌ఎం దరఖాస్తులకు రేపే ఆఖరు

మెదక్‌ కలెక్టరేట్‌: పటిష్ట ప్రణాళికతో గ్రామాల్లో రీ సర్వే నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో సర్వే, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో రైతులకు రీ సర్వేపై అవగాహన కల్పించి, సందేహాలను నివృత్తి చేయాలన్నారు. రీసర్వే నిర్వహించిన గ్రామాల్లో 9 (2) నోటీసులు అందిన వారి అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించాలన్నారు. పటిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లినప్పుడే ప్రజలు అడిగే సందేహాలను నివృత్తి చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ అంబదాస్‌ రాజేశ్వర్‌, ఏడీ సర్వే కిషన్‌, రెవెన్యూ డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, సీనియర్‌ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

మెదక్‌ కలెక్టరేట్‌: ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూ ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని డీఆర్‌ఓ అంబదాస్‌ రాజేశ్వర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా పలు మండలాల నుంచి తరలివచ్చిన ప్రజలు భూ భారతి 33, ఇందిరమ్మ ఇండ్లు 13, పెన్షన్లు 4, ఇతర సమస్యలపై 33 వినతులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా చేగుంట మండలంలో కోతుల బెడద తీవ్రంగా ఉందని, ఇళ్లలోకి చొరబడి దాడులు చేస్తున్నాయని చేగుంట మండల కేంద్రానికి వేణుగోపాల్‌ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

మెదక్‌జోన్‌: ప్రజావాణి ఫిర్యాదులపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఎస్పీ శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక మోసాలు, వేధింపులకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఫిర్యాదుపై సమగ్ర విచారణ చేపట్టి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దన్నారు. ప్రజలకు నాణ్యమైన పోలీస్‌ సేవలు అందించడంతో పాటు సమస్యల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనంతో వ్యవహరించాలని స్పష్టం చేశారు.

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలో ఎన్‌హెచ్‌ఎం పోస్టుల దరఖాస్తులకు రెండు రోజులే గడువు ఉండటంతో సోమవారం దరఖాస్తుదారులతో కలెక్టరేట్‌, డీఎంహెచ్‌ఓ కార్యాలయం కిటకిటలాడింది. ఈనెల 6వ తేదీ నుంచి ఇప్పటి వరకు 2,050 దరఖాస్తులు వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ సూపరింటెండెంట్‌ సుధాకర్‌ తెలిపారు. 64 పోస్టులకు కాంట్రాక్ట్‌ పద్ధతిన దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement