టీచర్ల కొరత.. వెత! | - | Sakshi
Sakshi News home page

టీచర్ల కొరత.. వెత!

Sep 29 2026 7:24 AM | Updated on Sep 29 2026 7:24 AM

● విధుల్లో ఉన్నది 3,410 మాత్రమే

● 633 ఉపాధ్యాయుల పోస్టుల ఖాళీలు

● కుంటు పడుతున్న విద్యాబోధన

జిల్లాకు మంజూరు పోస్టులు 4,043

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఏళ్ల తరబడి టీచర్ల పోస్టుల భర్తీ చేయకపోవడంతో విద్యాబోధన అంతంత మాత్రంగానే కొనసాగుతుంది. కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతామని చెబుతున్న ప్రభుత్వం ఖాళీలపై మాత్రం దృష్టి సారించడం లేదు. దీంతో కొందరు తల్లిదండ్రులు ్ఢ్ఢతమ పిల్లలను ప్రైవేట్‌ స్కూళ్లకు పంపుతున్నారు. – మెదక్‌జోన్‌

జిల్లావ్యాప్తంగా 1 నుంచి 10వ తరగతి వరకు 886 పాఠశాలలుండగా, వాటిలో 603 ప్రాథమిక పాఠశాలలు, 128 ప్రాథమికోన్నత, 155 ఉన్నత పాఠశాలు ఉన్నాయి. వీటిలో 73 వేల పైచిలుకు విద్యార్థులు చదువుకుంటున్నారు. కాగా, జిల్లాకు 4,043 మంది ఉపాధ్యాయులు పోస్టులు మంజూరు కాగా, ప్రస్తుతం ఉన్నది మాత్రం 3,410 మంది మాత్రమే. ఈ లెక్కన 633 మంది తక్కువగా ఉన్నారు. దీంతో అనేక పాఠశాలల్లో బోధన సక్రమంగా సాగక.. షెడ్యూల్‌ ప్రకారం పాఠ్యాంశాలు పూర్తి కాక ఇబ్బందులు తప్పడం లేదు.

238 బడుల్లో ఏకోపాధ్యాయులే..

జిల్లాలో 603 ప్రాథమిక పాఠశాలలుండగా, వాటిలో 238 బడుల్లో ఏకోపాధ్యాయులే ఉన్నారు. ఆ బడుల్లో 1–5వ తరగతి వరకు కొనసాగుతుండగా, వాటిలో కనీస బోధన ముందుకుసాగని పరిస్థితి. ఐదు తరగతుల విద్యార్థులను ఒకే గదిలో కూర్చోబెట్టి బోధిస్తుంటే ఏ తరగతికి ఏ పాఠం చెబుతున్నారో అర్థంకాని దుస్థితి. దానికి తోడు కాంప్లెక్స్‌ మీటింగులు, పిల్లల హాజరు ప్రతిరోజు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. అసలే 5 తరగతుల ఏకో ఉపాధ్యాయుడే ఉండటం.. అతడికి మిగితా పనులు ఉండటం వల్ల పిల్లలకు కనీస చదువు చెప్పటం సాధ్యం కావటం లేదని తెలుస్తోంది.

తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య

సర్కారు బడుల్లో ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గుతూనే ఉంది. ఇందుకు ప్రధాన కారణం టీచర్ల కొరతేనని పలువురు చెబుతున్నారు. సరిపడా బోధకులను నియమించాల్సిన ప్రభుత్వం, దానిని పక్కన బెట్టి ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నాం అంటే ఏం లాభమని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో చదివేవారంతా పేద విద్యార్థులే కావడంతో యూనిఫాంలు, బుక్స్‌, మధ్యాహ్న భోజనం అందిస్తుండగా.. తాజాగా ఉదయం అల్పాహారం సైతం అందిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా, అసలు విద్యార్థులకు చదువు చెప్పే గురువులే లేకపోతే మిగతావి ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ప్రైవేట్‌ బాట

మధ్య తరగతి తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలలో చదివించే స్థోమత లేకున్నా, రూ. లక్షలు అప్పు చేసి ప్రైవేట్‌ బడులకు పంపిస్తున్నారు. సర్కార్‌ బడులకు పంపించేందుకు మాత్రం ససేమిరా అంటున్నారు. ఎందుకంటే బోధకులే లేని బడులకు పంపితే తమ పిల్లలకు చదువెలా వస్తోందని పేర్కొంటున్నారు. అలాగే జిల్లాలో 3,410 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులుండగా, వారిలో కేవలం 2 శాతం మంది మాత్రమే వారి పిల్లలను సర్కారు బడులకు పంపుతున్నారు. మిగితా 98 శాతం మంది ప్రైవేట్‌ బడుల్లోకి పంపిస్తున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం తరగతికో ఉపాధ్యాయుడు ఉండాలని, వారే లేనప్పుడు మా పిల్లలకు ఆ బడుల్లోకి ఎందుకు పంపాలని టీచర్లే ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి కనీసం విద్య వలంటీర్లనైనా నియమించి సర్కారు బడుల్లో చదువు సక్రమంగా సాగే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement