తొమ్మిదేళ్లు గడిచినా పూర్తి కాని నిర్మాణం
నర్సాపూర్: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో డబుల్‌బెడ్రూం ఇళ్ల నిర్మాణం 9 ఏళ్ల క్రితం చేపట్టినా, ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. అయితే ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగడానికి పలు కారణాలు ఉన్నాయి. బిల్లులు రాకపోవడంతో కొన్ని బ్లాకుల నిర్మాణ పనులను కాంట్రాక్టర్లు మధ్యలోనే వదిలేశారని తెలిసింది. కాగా, పట్టణానికి 2017లో 500 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు కావడంతో అప్పటి మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. దీంతో 2018లో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఎదురుగా ఉన్న స్థలంలో 252, వెనక భాగంలో 248 ఇళ్లు నిర్మించాలని నిర్ణయించి పనులు చేపట్టారు. కాగా, ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేయాలని ఇందిరమ్మ గృహ నిర్మాణ శాఖ నిర్ణయించినా, పలు శాఖల అధికారుల నిర్లక్షం కారణంగా పంపిణీ ప్రక్రియలో జాప్యం జరుగుతుంది.
పగిలిన కిటికిల గ్లాసులు
మార్కెట్ కమిటీ ఎదురుగా చేపట్టిన 252 ఇళ్ల నిర్మాణం పూర్తయినా వాటిని ఇప్పటివరకు పేదలకు పంపిణీ చేయలేదు. అనేక బ్లాకుల వద్ద ఏర్పాటు చేసిన కరెంట్ ప్యానల్ బోర్డులలో మెటీరియల్ చోరీకి గురి కాగా, పలు బోర్డులు పాడయ్యా యి. పలు ఇళ్ల కిటికీల తలుపులు ధ్వంసమయ్యాయి. బ్లాకుల మధ్య నిర్మించిన సిమెంట్ రోడ్డుకు పలు చోట్ల పగుళ్లు ఏర్పడడం గమనార్హం. ఇదిలా ఉండగా, మార్కెట్ కమిటీకి వెనుక భాగాన నిర్మించతలపెట్టిన 248 ఇండ్లలో పలు బ్లాక్‌లు గ్రౌండ్ ఫ్లోర్ స్థాయిలో, కొన్నిమొదటి అంతస్తు స్థాయిలో ఉండగా, కొన్ని రెండస్థుల నిర్మాణ స్థా యిలో ఉన్నాయి. ఇవి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారాయనే ఆరోపణలు వస్తున్నాయి. పలువురు పేకాటరాయుళ్లు అడ్డాగా మార్చుకున్నారని తెలిసింది.
నత్తనడకన ఇతర పనులు
నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్‌రూం ఇళ్లతో పాటు వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నవాటిని పేదలకు పంపిణీ చేయాలని ఇందిరమ్మ గృహ నిర్మాణ శాఖ నిర్ణయించింది. ఇండ్ల కోసం మున్సిపాలిటీలో సుమారు 2,150 మంది దరఖాస్తు చేయగా, వారిలో అర్హులను ఎంపిక చేసి పంపిణీ చేయాలని నిర్ణయించారు. వివిధ దశల్లో ఉన్న ఇళ్లను పేదలకు అందచేసి వాటి నిర్మాణ పనులు లబ్ధిదారులే చేపట్టుకునే విధంగా అవగాహన కల్పించడంతో పాటు నిర్మాణం పూర్తవగానే ఇంటి నిర్మాణ వ్యయం బిల్లులు అందచేసే విధంగా ఇందిరమ్మ గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు ప్రణాళిక తయారు చేశారు. కాగా, ఇళ్ల కోసం దరఖాస్తు చేసిన 2,150 మందిలో అర్హులను ఎంపిక చేసేందుకు పలుశాఖల సిబ్బందితో పట్టణంలో విచారణ చేపట్టారు. విచారణ చేపట్టి నెలలు గడుస్తున్నా మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విచారణ వివరాలు కంప్యూటరీకరణలో జాప్యం జరిగిందని తెలిసింది. ఇటీవల రెవెన్యూ అధికారులు విచారణ పత్రాలు తెప్పించుకుని కంప్యూటరీకరణ పనులు చేపట్టారని తెలిసింది.
అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లు


