● ఎమ్మెల్యే రోహిత్‌రావు
● కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ నాయకుల ధర్నా
మెదక్ కలెక్టరేట్: సమగ్ర ఓటరు సవరణ పేరుతో ఓటుచోరికి పాల్పడుతున్న కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్, ఇందుకు సహకరిస్తున్న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా వెంటనే రాజీనామా చేయాలని ఎమ్మెల్యే రోహిత్‌రావు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ నాయకులతో కలిసి పెద్దఎత్తున ధర్నా నిర్వహించి వారి దిష్టిబొమ్మలను దహనం చేశారు. అంతకుముందు క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రోహిత్‌రావు, డీసీసీ అధ్యక్షుడు అంజనేయులు గౌడ్ మాట్లాడుతూ.. సర్ ప్రక్రియ పారదర్శకత, ఓటర్ల జాబితాపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ ప్రతిమాసింగ్‌కు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కానుగు రాధిక, వైస్ చైర్మన్ నరేశ్‌గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు గంగాధర్, మున్సిపల్ కౌన్సిలర్లు, జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


