తూప్రాన్: అక్టోబర్ 4న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాకను పురస్కరించుకుని తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని బ్రహ్మణపల్లి శివారులో నూతనంగా నిర్మించనున్న అముల్ పాల పరిశ్రమ శంకుస్థాపన స్థలాన్ని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు సోమవారం పరిశీలించారు. డీఎస్పీ నరేందర్‌గౌడ్, రెవెన్యూ అధికారులతో కలిసి ఆయన బ్రహ్మణపల్లి రైల్వేగేటు సమీపంలోని ఖాళీ స్థలంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈసందర్భంగా భద్రత, వేదిక నిర్మాణం, వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై అధికారులకు ఎంపీ పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన ఇంకా అధికారికంగా ఖరారు కాలేదని, అయితే ఆయన వచ్చే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారం మేరకే ఈ స్థల పరిశీలన చేసినట్లు స్పష్టం చేశారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి భారీగా రైతులను, ప్రజలను సమీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేష్, బీజేపీ తూప్రాన్ మున్సిపల్ అధ్యక్షుడు భూమన్న గారి జానకిరామ్‌గౌడ్, మండల అధ్యక్షుడు పిట్ల పోషయ్య, కౌన్సిలర్లు సత్యనారాయణ, అశోక్, స్వామి మనోహరాబాద్, శివ్వంపేట మండలాలకు చెందిన బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
స్థలాన్ని పరిశీలించిన ఎంపీ రఘునందన్‌రావు


