● డ్యూటీ ఇవ్వకపోవటంతో అదృశ్యమైన ఆర్టీసీ డ్రైవర్
● ఆందోళనలో కుటుంబీకులు
● మెదక్ డిపోలో కలకలం
మెదక్‌జోన్: కలెక్షన్ తక్కువచ్చిందని ఓ ఆర్టీసీ డ్రైవర్‌కు డ్యూటీ ఇవ్వకుండా అధికారులు వేధింపులకు గురిచేయటంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబీకులు ఆందోళన చెందుతుండగా, డిపోలో తీవ్ర కలకలం నెలకొంది. వివరాలు ఇలా.. పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లి తండాకు చెందిన కెతావత్ గోపాల్ కొంతకాలంగా మెదక్ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈనెల 24న వినాయకుడి నిమజ్జనం రోజు బీదర్ నైట్‌ఆల్ట్ డ్యూటీ చేయాలని ఎక్స్‌ప్రెస్ బస్సు ఇచ్చారు. కాగా మెదక్ నుంచి బీదర్, వయా జహీరాబాద్ నుంచి మహాత్మాగాంధీ బస్టాండ్ (ఎంజీబీఎస్)లో నైట్ ఆల్ట్ చేసి 25న ఉదయం తిరిగి మెదక్ డిపోకు వచ్చాడు. కాగా ఆ రోజు నిమజ్జనం సందర్భంగా రావాల్సిన కలెక్షన్ కన్నా తక్కువ వచ్చింది. దీంతో ఉన్నతాధికారులు ఆ మరుసటి రోజు డ్యూటీ ఇవ్వకుండా (డీఎస్) డిపో స్పేర్‌లో పెట్టారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన గోపాల్ 26న ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. సెల్‌ఫోన్ సైతం తీసుకెళ్లకపోవడంతో అతడి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం మెదక్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి అక్కన్నపేట సమీపంలో రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకోగా, గోపాల్ కుటుంబీకులు హుటాహుటిన వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. చనిపోయిన వ్యక్తి గోపాల్ కాకపోవటంతో ఊపిరిపీల్చుకున్నారు. అధికారుల వేధింపులు ఆపాలని సిబ్బంది కోరుతున్నారు. కాగా, ఈ విషయంపై ఆర్టీసీ సీఐ నర్సింలును వివరణ కోరగా.. తాము ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదని బదులిచ్చారు.


