కౌడిపల్లి(నర్సాపూర్): రైతులు అధిక ఆదాయాన్ని ఇచ్చే కూరగాయలు, ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. సోమవారం మండలంలోని ముట్రాజ్‌పల్లిలో రైతు రవీందర్ తన పాలీహౌస్‌లో సాగుచేస్తున్న కీరదోస సాగును పరిశీలించారు. సాగు ఖర్చు, దిగుబడి, మార్కెటింగ్, ఆదాయంపై రైతును వివరాలు అడిగి తెలుసకున్నారు. తక్కువ నీరు, ఖర్చుతో అధిక దిగుబడి సాధించి రూ. లక్షల్లో ఆదాయం వస్తుందని రైతు వివరించారు. అనంతరం మరో రైతు శ్రీనివాస్‌గుప్త సాగుచేస్తున్న ఆయిల్‌పామ్ సాగును పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తున్నాయని, రైతులు వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయలు, ఇతర ఆదాయం వచ్చే పంటలు సాగుచేయాలని సూచించారు. ఆయిల్‌పామ్‌లో పరాగ సంపర్కం వల్ల గెల బరువు, దిగుబడి పెరుగుతుందని వివరించారు. ఫాంపాండ్‌లో వర్షం నీటిని ఒడిసిపట్టి పంటలకు నీటిని వినియోగించవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి ప్రతాప్‌సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్, ఏఓ స్వప్న, ఏఈఓ సౌజన్య, సర్పంచ్ పద్మ, మాజీ ఉప సర్పంచ్ వెంకటేశం, ఉద్యాన విస్తరణ అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతిమాసింగ్


