శివ్వంపేట(నర్సాపూర్): మండలంలోని చిన్నగొట్టిముక్కుల సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాలకు మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఇన్‌చార్జి ఏఈ నరేందర్ తెలిపారు. విద్యుత్ లైన్ల నిర్వహణ, మరమ్మతుల కారణంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు చెప్పారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజావాణికి హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. 91 అర్జీలు రాగా, సంబంధిత శాఖల అధికారులకు కేటాయిస్తూ, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ అంబదాస్ రాజేశ్వర్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, వివిధశాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా హవేళిఘణాపూర్ మండలం వాడి గ్రామానికి చెందిన గుమ్మల నర్సింలు, కార్యదర్శి సర్పంచ్‌తో కుమ్మకై ఇళ్లు కట్టుకునేందుకు అనుమతి ఇవ్వడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.


