● జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్
● సాలోజిపల్లిలో
భూముల రీ సర్వే పరిశీలన
టేక్మాల్(మెదక్): సెక్షన్‌్ 22ఏ పరిధిలోని భూములకు సంబంధించి మండల, గ్రామాల వారీగా సమగ్రంగా పరిశీలించి కచ్చితమైన డేటాను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. టేక్మాల్ మండలం సాలోజిపల్లిలో మంగళవారం భూముల రీ సర్వేను ఏడీ ల్యాండ్ సర్వేయర్ కిషన్‌తో కలిసి పరిశీలించారు. భూములు రీ సర్వే, భూ భారతి, సాదా బైనామా, రెవెన్యూ సదస్సు దరఖాస్తులు పరిష్కారంపై రెవెన్యూ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ..వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలను సెక్టార్, గ్రామాల వారీగా ప్రొఫార్మాలో సిద్ధం చేయాలన్నారు. మండల, గ్రామాల వారీగా భూముల విస్తీర్ణంలో వ్యత్యాసాలు ఉన్నట్లయితే అవసరమైన సవరణలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్న పాత డేటాను సేకరించి ప్రస్తుత వివరాలతో పోల్చి పూర్తిస్థాయి నివేదికలను సిద్ధం చేయాలని సూచించారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చిన అంశాలకు సంబంధించి నిబంధనల ప్రకారం ప్రొఫార్మాలు సిద్ధం చేసి, తహసీల్దార్, ఆర్డీవో, రెవెన్యూ అదనపు కలెక్టర్ సంతకాలతో సమర్పించాలని తెలిపారు. నవంబర్ 30 నాటికి భూములకు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌్‌పై పూర్తి వివరాలతో కూడిన నివేదికలను ప్రతీ మండల తహసీల్దార్ జిల్లా కలెక్టర్‌కు సమర్పించాలని ఆదేశించారు.
పంటల నమోదుపై నిర్లక్ష్యం వద్దు
రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను నమోదుపై ఎటువంటి నిర్లక్ష్యం చేయరాదని సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. మండలంలోని ఎల్లుపేట్ గ్రామంలో జరుగుతున్న పంటల నమోదును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పంటల నమోదును పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 6.9% పంట నమోదు పూర్తయినట్లు వివరించారు. పంటల నమోదు ప్రక్రియను సెప్టెంబర్ 30 వరకు నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, సమగ్ర వివరాలను సంబంధిత శాఖకు అందజేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, వ్యవసాయ అధికారి రాంప్రసాద్, స్థానిక సర్పంచ్ మాధవి నరసింహారెడ్డి, ఏఈఓ సుభాశ్ తదితరులు పాల్గొన్నారు.


