డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్
నర్సాపూర్: స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి ఉనికికోసమే రోడ్లు బాగు చేయాలంటూ పాదయాత్ర చేశారని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజా పాలన వెయ్యి రోజులు పూర్తి చేసుకుని మహత్తర మైలరాయిని దాటిందని చెప్పారు. ఈ సందర్భంగా వారు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ...రేవంత్‌రెడ్డి పాలన పేదోడి గుండె చప్పుడన్నారు. ప్రజాపాలనను అన్ని వర్గాల ప్రజలు హర్షిస్తుంటే బీఆర్‌ఎస్ తట్టు కోలేకపోతోందని మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు బీఆర్‌ఎస్ వారం రోజుల కార్యక్రమం అంటున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్ల పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం రూ.వేలకోట్లు కాజేశారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలోనే నర్సాపూర్ అభివృద్ధి చెందిందని, బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో నర్సాపూర్ చాలా వెనుకబడిందని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర్‌రెడ్డి తెలంగాణకు సాగు నీరందించాలని ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని, బీఆర్‌ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో నియోజకవర్గంలోని నర్సాపూర్, శివ్వంపేట, కౌడిపల్లి మండలాలకు అదనంగా ఎకరం భూమికి సాగు నీరిచ్చారా ప్రశ్నించారు. బీఆర్‌ఎస్, బీజేపీలు ఒకే కోవకు చెందిన పార్టీలని వారు ఆరోపించారు. నర్సాపూర్ నుంచి కాంగ్రెస్ టికెట్‌కు తాను, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ పోటీ పడినప్పటికీ టికెట్ ఎవరికి వచ్చినా కలిసి పనిచేస్తామని నియోజకవర్గ ఇన్‌చార్జి రాజిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మి, పార్టీ నాయకులు రిజ్వాన్, లలిత, అశోక్, నరేందర్‌రెడ్డి, మేఘమాల, గంగాధర్, సుధీర్‌గౌడ్, దావూద్ తదితరులు పాల్గొన్నారు.


