● లీటర్‌కు రూ. 6 చొప్పున పెంపు
● గేదెల కొనుగోలుకు రుణాలు
● సబ్సిడీపై దాణ సరఫరా
మెదక్‌జోన్: విజయ డెయిరీ పాడి రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గేదె పాలకు లీటర్‌కు రూ. 6 చొప్పున, ఆవుపాలకు లీటర్‌కు రూ. 2 చొప్పున పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లావ్యాప్తంగా 1,050 మంది పాడి రైతులు ప్రభుత్వాధీనంలో కొనసాగే విజయ డెయిరీకి నిత్యం 3,400 లీటర్ల పాలు పోస్తున్నారు. ఇందులో పాల నాణ్యతను బట్టి (ప్యాడీ) లీటర్‌కు రూ. 50 నుంచి మొదలుకుని రూ. 85 వరకు చెల్లిస్తున్నారు. తాజాగా ఈనెల 16 నుంచి పాల ధరలు పెంచారు. దీంతో ప్రస్తుతం లీటర్ రూ. 56 నుంచి మొదలుకుని రూ.91 వరకు చెల్లిస్తున్నారు. అలాగే ఆవు పాలకు మొన్నటి వరకు లీటర్‌కు రూ. 42 ఉండగా, ప్రస్తుతం రూ.44కు పెంచటంతో పాటు లీటర్‌పై రూ. 2 అదనంగా వస్తోంది. అంతే కాకుండా పాడి గేదెలకు అందించే దాణాను సబ్సిడీతో సరఫరా చేస్తుండగా, గేదెల కొనుగోలు కోసం రూ.లక్ష నుంచి రూ. 10 లక్షల వరకు బ్యాంకుల నుంచి పాడి రైతులకు రుణాలు ఇప్పించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు.


