ఖిల్లా చరిత్ర నలుదిశలా..
● పోస్టు కార్డుపై మెదక్ కోట ముద్రణ
● స్వదేశీదర్శన్ పథకానికి ప్రతిపాదన
● పర్యాటకాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్
మెదక్ జోన్: మెతుకుసీమలో పర్యాటకులను ఆకట్టుకునే అనేక ప్రత్యేకతలు ఉన్నా చెప్పుకోదగ్గ అభివృద్ధికి నోచుకోలేకపోయింది. రాజుల కాలంనాటి చారిత్రక కట్టడాలు... రుషులు తపస్సు చేసిన ఆధ్యాత్మిక ఆలయాలు ఉన్నాయి. పచ్చటి అడవుల అందాలు, వాటిలో కళ్ల ముందు కదలాడే చుక్కల జింకల పరుగులు, పురివిప్పి నాట్యం చేసే నెమళ్లు, కోయిల రాగాలు వినిపిస్తుంటాయి. నిజాం కాలంలో నిర్మించిన ప్రాజెక్టు అందాలు కనువిందు చేస్తుంటాయి. ఇలాంటి ప్రాంతం ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోక పోవడంతో తాజాగా జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో పర్యాటకాభివృద్ధికి కృషి చేస్తున్నారు.
అతిపెద్ద చర్చి..
మెదక్ జిల్లాలో చూడదగిన పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. మెదక్ పట్టణాన్ని ఆనుకొని కోటడడ్డపై ఖిల్లాను 12వ శతాబ్దం నాటి కాకతీయుల కాలంలో రెండో ప్రతాప రుద్రుడి హయాంలో నిర్మించారు. ఇక్కడ పంటలు సమృద్ధిగా పండటంతో ఈ ప్రాంతానికి మెతుకు సీమ అనే పేరు వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ఈ కోటను కాకతీయుల అనంతరం ఢిల్లీసుల్తాన్లు, కుతుబ్‌షాలు, చివరగా నిజాం ఆధీనంలోకి చేరింది. ఈ కోటపై భారీ ఫిరంగి, 17వ శతాబ్దంలో నిర్మించిన కుతుబ్‌షాహీ మసీదు, ధాన్యాగారాలు, నీటి సౌకర్యం కోసం నిర్మించిన బావులు, కోటపై నుంచి చూస్తే పట్టణం, ప్రకృతి దృశ్యాలు చూపరులను కట్టిపడేస్తాయి. ఈ ప్రాంతంలో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద చర్చి, ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వనదుర్గామాత ఆలయం, నర్సాపూర్‌లోని అర్బన్‌పార్కు, పోచారం అభయారణ్యంలోని జింకల ప్రత్యూత్పత్తి కేంద్రం, దాని పక్కనే పోచారం ప్రాజెక్టు, టేక్మాల్ మండలం వెల్పుగొండలో వెయ్యేళ్ల నాటి తుంబురేశ్వరుడి(శివుడి) ఆలయం, కొల్చారంలోని జైన్‌మందిరం ఇలా చూడదగిన ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు టూరిజంపై దృష్టి సారించలేక పోవటంతో ఇవి చాలా వరకు మరుగునపడ్డాయి.
అగ్రగామిగా నిలిపేందుకు
ప్రస్తుత కలెక్టర్ ప్రతిమా సింగ్ గతంలో జిల్లాలో అదనపు కలెక్టర్‌గా దాదాపు రెండేళ్ల పాటు పనిచేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కలెక్టర్‌గా తిరిగి జిల్లాకు వచ్చారు. జిల్లాను అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలపాలనే తపనతో పాటు పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. గత జులైలో సినీ హీరో మంచు విష్ణును ప్రత్యేకంగా జిల్లాకు ఆహ్వానించారు. ఆయన ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో పూజలు చేసి మెదక్ ఖిల్లాను సందర్శించి మంత్రముగ్ధుడయ్యారు.
స్వదేశీ దర్శన్‌తో నిధులు
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించటానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వదేశీ దర్శన్ పథకంలో భాగంగా మెదక్ ఖిల్లా అభివృద్ధికి నిధుల కోసం ప్రతిపాదనలు పంపించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి ఎంపీ రఘునందన్‌రావు నేతృత్వంలో ఈ నిధులను రాబట్టి ఖిల్లాపైకి రోడ్డు నిర్మాణం, పైనా వెడ్డింగ్ పార్క్ సౌకర్యం కల్పించటం, సెక్యూరిటీ గాడ్స్, పర్యాటకులు బస చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది.
తపాలాశాఖ అధికారులతో కలెక్టర్ ప్రత్యేకంగా చర్చించి పోస్టల్ కార్డుపై మెదక్ ఖిల్లా(ఫోర్ట్)ను ప్రత్యేకంగా ముద్రింపజేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్‌తో పాటు ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే రోహిత్‌రావుల చేతుల మీదుగా పోస్టల్ కార్డును ఆవిష్కరింపజేశారు. దీంతో ఖిల్లా చరిత్ర నలుదిశలా వ్యాప్తి చెందనుంది.


