రైతు బీమాకు మంగళం! | - | Sakshi
Sakshi News home page

రైతు బీమాకు మంగళం!

Aug 19 2026 9:04 AM | Updated on Aug 19 2026 9:04 AM

గడువు దాటినా రైతు బీమా పాలసీలు రెన్యూవల్‌ కాకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. ఏటా ఆగస్టు 14 నుంచి రైతు బీమా ప్రక్రియ ప్రారంభమవుతుంది. కానీ సమయం దాటినా, ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు వెలువడక పోవడం, పథకం కొనసాగింపుపై స్పష్టత కరువవడం, ప్రభుత్వం, వ్యవసాయ శాఖ తరఫున సమాచారం లేకపోవడంతో రైతన్నలు సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే తెల్లరేషన్‌ కార్డుగల ప్రతీ కుటుంబానికి బీమా ఇస్తామని, గతంలో ప్రభుత్వం ప్రకటించినందున, రైతు బీమా ప్రత్యేకంగా ఇవ్వాలా? వద్దా? అనే విషయమై ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

–పాపన్నపేట(మెదక్‌)

జిల్లాలో 3,67,688 ఎకరాల సాగు భూమి ఉండగా, గత యాసంగికి సంబంధించి 2,62,043 రైతులు పంటలు సాగు చేశారు. సాధారణంగా రైతులు పొలాల వద్దకు వెళ్తుంటారు. రాత్రిళ్లు విషపు పాముల ప్రమాదం పొంచి ఉంటుంది. అలాగే బోర్ల వద్ద, కరెంటు ప్రమాదాలు జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో రైతు కుటుంబాలను ఆదుకునే ఉద్దేశ్యంతో అప్పటి తెలంగాణ ప్రభుత్వం 2018లో రైతు బీమా పథకాన్ని ప్రారంభించింది. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు గల రైతులు ఆ పథకానికి అర్హులు. ఒక్కో రైతుకు ప్రభుత్వం రూ.3,556 చొప్పున ఎల్‌ఐసీకి ప్రీమియం చెల్లిస్తుంది. ప్రతీ ఏటా ఆగస్టు 13 అర్థరాత్రితో పాలసీ కాలపరిమితి ముగుస్తుంది. రైతులెవరైనా చనిపోతే వారి వారసులకు పది రోజుల్లోగా రూ.5 లక్షలు చెల్లిస్తారు.

వీడని సందిగ్ధత

ఆగస్టు 14 కావాల్సిన పాలసీ రెన్యూవల్‌ నాలుగు రోజులు దాటినా కాకపోవడంతో, అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతీ ఏటా గడువుకు 20 రోజుల ముందే, వెబ్‌సైట్‌ తెరుచుకుంటుంది. కొత్తగా అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకుని, ఏఓలు, ఏఈఓలు అప్‌లోడ్‌ చేస్తారు. కానీ ఈ ఏడాది ప్రభుత్వం,వ్యవసాయ శాఖ తరఫునా, ఎలాంటి స్పందన లేదని తెలుస్తోంది. అయితే తెల్లరేషన్‌ కార్డులు ఉన్న ప్రతీ కుటుంబానికి రూ.5 లక్షల కుటుంబ బీమా చేయించనున్నట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తిరిగి ప్రత్యేకంగా రైతు బీమా ఇవ్వాల్సిన అవసరం ఉందా? అనే సందిగ్ధంలో ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై పాపన్నపేట వ్యవసాయాధికారి శ్రీనివాస్‌రాజును వివరణ కోరగా రైతు బీమాకు అర్హులైన కొత్త రైతుల పేర్లు నమోదు చేసుకునేందుకు సంబంధించిన వెబ్‌సైట్‌ ఓపెన్‌ కావడంలేదని, రెన్యూవల్స్‌పై ఎలాంటి ఉత్తర్వులు రాలేదని తెలిపారు.

గడువు దాటినా రెన్యూవల్‌ కాని బీమా

ప్రత్యామ్నాయ బీమా దిశగా అధికారులు?

జిల్లాలో మొత్తం రైతులు 2,62,043

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement