●కట్ట వేసి.. కాలువ తీసిన అక్రమార్కులు ●నేతలు, అధికారుల అండతో ఆగడాలు
అల్లాదుర్గం(మెదక్): చేపల చెరువుల కోసం అక్రమార్కులు చెరువునే కబ్జా చేశారు. సుమారు 50 ఎకరాల ఎఫ్‌టీఎల్ భూమిని యథేచ్ఛగా కబ్జా చేసి.. చెరువు నుంచి జేసీబీలతో కాలువలు తీసి, భారీ మోటార్లతో నీటిని పంపింగ్ చేశారు. కట్ట వేసి దారి చేసుకున్నారు. ఇరిగేషన్ అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టడంతో అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కబ్జాదారుడికి అందోల్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతల అండదండలు ఉండటంతో అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
పట్టించుకోని అధికారులు
చెరువు కబ్జా చేసి ఐదారు జేసీబీలతో పెద్ద ఎత్తున కాలువలు తీస్తే ఇరిగేషన్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. పెద్ద ఎత్తున ముడుపులు అందడంతోనే అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలున్నాయి. అక్రమార్కుడికి అందోల్ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేతల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇరిగేషన్ అధికారులను మేనేజ్ చేసుకున్నట్లు రైతులు చెబుతున్నారు. ఈ విషయంపై అల్లాదుర్గం ఇరిగేషన్ ఏఈ వైష్ణవిని వివరణ కోరగా తమ దృష్టికి వచ్చిందని, చెరువు పరిధి అందోల్ అధికారులకు రావడంతో సమచారం ఇచ్చినట్లు చెప్పారు. వారు చర్యలు తీసుకోకుంటే ఎస్‌ఈకి చెప్పి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


