పాపన్నపేట(మెదక్): రాష్ట్రంలో ధూప, దీప నైవేద్య అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవ శర్మ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన వనదుర్గా భవానీ ఆవరణలో నిర్వహించిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మరిన్ని ఆలయాలను ధూప దీప నైవేద్య పధకంకింద ఎంపిక చేయాలన్నారు. అర్చకులకు పేస్కేల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డీడీఎస్ అధ్యక్షుడు సలాక రాజేశ్వరశర్మ, ఉపాధ్యక్షులు చంద్రశేఖర శర్మ, రాష్ట్ర కోశాధికారి హరికిషన్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
నర్సాపూర్/నిజాంపేట(మెదక్): రాష్ట్ర విజిలెన్స్ అధికారులు జిల్లాలో పలు చోట్ల ఆకస్మికంగా తనిఖీలు చేశారు. మంగళవారం రాత్రి నర్సాపూర్ మండలంలోని రైస్‌మిల్లులో తనిఖీలు చేపట్టారు. అలాగే నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో విద్య రైస్‌మిల్లులో రాష్ట్ర విజిలెన్స్ అధికారుల ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు రైస్‌మిల్లులో ఉన్న నిల్వలను పరిశీలించారు.
● గిరిజన ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయుల ఆవేదన
● కలెక్టరేట్ ఎదుట ధర్నా
మెదక్ కలెక్టరేట్: పదేళ్లుగా పనిచేస్తున్నా.. సరైన వేతనం, ఉద్యోగ భద్రత లేక తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నామని మెదక్‌లోని గిరిజన ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఉపాధ్యాయులు మంగళవారం మెదక్ సమీకృత కలెక్టరేట్ వద్ద నిరవధిక సమ్మె చేపట్టారు. వీరికి సీఐటీయూ సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లుగా 339 మంది పనిచేస్తున్నట్లు తెలిపారు. నెలకు కేవలం రూ.12వేలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలు గడవక అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా నాయకులు గోపాల్, ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల జిల్లా అధ్యక్షులు రాజేశ్వరి, ఉపాధ్యక్షులు సుధాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ రెహానా బేగం, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గౌడ్ ,కోశాధికారి రేణుక ,టీచర్లు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర
సంగారెడ్డి టౌన్: రాజీమార్గంతో కేసులను పరిష్కరించుకోవడానికి జాతీయ లోక్ అదాలత్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని ఆమె కోరారు. మంగళవారం జిల్లా కోర్టులో పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న కేసులను వీలైనంత ఎక్కువ సంఖ్యలో పరిష్కరించుకోవాలన్నారు. ఇందుకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కక్షిదారులకు సత్వర న్యాయపరమైన సేవలు అందేలా చూడాలని, పరస్పర అంగీకారంతో సమస్యలను పరిష్కరించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య, పలువురు జడ్జిలు, న్యాయవాదులు, సంబంధిత శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


