ప్రజావాణికి
వెల్దూర్తి మండలంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి పలువురు కీలకశాఖల అధికారులు హాజరు కాలేదు. వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ, మత్స్య, విద్య, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌అండ్‌బీ, పోలీసుశాఖకు చెందిన అధికారులు డుమ్మాకొట్టారు. మిగతా శాఖల అధికారులకు బదులు వారి సబార్డినేట్లను పంపించారు. మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన రైతు సిద్దిరాములు ఎరువులకు సంబంధించిన సమస్యపై ఫిర్యాదు చేయగా, ఆ శాఖ అధికారి హాజరు కాకపోవటంతో ఆ అర్జీని నోడల్ అధికారికి ఇచ్చి వెనుదిరిగారు. రైతు సమస్యలను నేరుగా అధికారులకు చెప్పేందుకు వీలులేకుండా పోవటంతో పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఎల్కపల్లి గ్రామానికి చెందిన ఓ కుంటకట్టపై కొందరు గేటు ఏర్పాటు చేయటంతో దాన్ని తొలగించాలని పలువురు రైతులు ఫిర్యాదు చేశారు.
● శివ్వంపేట..మండలంలో మొత్తం ఏడు అర్జీలు వచ్చాయి. ఇందులో నవాబుపేటకు చెందిన మహబూబ్‌బేగంకు 13 మంది సంతానం అందులో ఎనిమిది మంది కొడుకులు, ఐదుగురు కూతుర్లు కాగా ఎవరూ తనకు అన్నం పెట్టడంలేదని ఫిర్యాదు చేశారు. అలాగే గ్రామ శివారులో డంపుయార్డు, ప్రభుత్వ కాలేజీ నిర్మాణానికి స్థలం కేటాయించాలని, పంచాయితీ పాలకవర్గం ఫిర్యాదు చేశారు. మిగతా ఐదు ఫిర్యాదులు విద్యుత్, భూసమస్యలు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినవి.
● చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజావాణికి ఆరు దరఖాస్తులు వచ్చాయి. అందులో ధరిపల్లి గ్రామానికి చెందిన గోపాల్‌రెడ్డి హల్దీ ప్రాజెక్టుకు చెందిన కెనాల్‌ను పరిరక్షించాలని ఫిర్యాదు చేయగా, మరో ఐదు భూ సమస్యలకు చెందినవి. కాగా చాలామంది మండలస్థాయి అధికాారులు హాజరుకాకుండా వారి అసిస్టెంట్లను మాత్రమే పంపించారు. దీంతో మా సమస్యలు పరిష్కారమవుతాయా అంటూ ఫిర్యాదుదారులు బహిరంగంగానే విమర్శించారు.
● కొల్చారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజావాణికి సగం శాఖలకు చెందిన అధికారులు గైర్హాజరు కాగా, నామమాత్రంగా కొందరు మాత్రమే హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి చిన్నఘనాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆ గ్రామంలోని ఫంక్షన్‌హాల్ పరిధి చూపాలని ఫిర్యాదు చేశారు.
● పాపన్నపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజావాణికి రెండు అర్జీలు మాత్రమే వచ్చాయి. ఇందులో కొండపాకలో శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంకును కూల్చాలని, మరోకటి మిన్‌పూర్‌లో ఓ కుంట సమీపంలోని పంటపొలాల్లో కల్వర్టు నిర్మించాలని అర్జీ ఇచ్చారు. కాగా 18 శాఖల అధికారులకు గానూ 10 శాఖల అధికారులు గైర్హాజరయ్యారు. మిగతా మండలాల్లో సైతం ఇదేవిధంగా నామమాత్రంగానే ప్రజావాణి కొనసాగింది.
బాధ్యతారహితంగా అధికారుల తీరు
తమ సమస్యలను ఉన్నతాధికారులకు చెప్పి పరిష్కరించుకుందామంటూ ఆయా గ్రామాలనుంచి ఎంతో ఆశతో మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి వస్తే అధికారులు బాధ్యతను మరిచి విధులకు ఎగనామం పెడితే, ఇక వారి సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి? ఇలాంటి అధికారులపై శాఖపరమైనా చర్యలు తీసుకుంటే తప్పా, వారి బాధ్యత గుర్తుకు రాదని పలువురు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇలాంటి అధికారులకు ఉన్నతాధికారులు వత్తాసు పలుకుతారా?లేక శాఖపరమైన చర్యలు తీసుకుని ఇక ముందు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూస్తారా అన్నది వేచి చూడాల్సిందే!
ప్రజావాణిలో ఫోన్లు చూస్తున్న అధికారులు
సమస్యల దరఖాస్తులు అందించేందుకు జిల్లా కేంద్రానికి రావటంకన్నా మండల కేంద్రాల్లో జరిగే ప్రజావాణిలో అర్జీలు సమర్పించవచ్చని చెప్పిన ప్రభుత్వ ఆదేశాలను అధికారులు తేలికగా తీసుకున్నట్లు కన్పిస్తోంది సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమం. ప్రజావాణికి కీలకశాఖల అధికారులు డుమ్మా కొట్టడంతో అనేక మండలాల్లో ఫిర్యాదుదారులు నిరాశతో వెనుదిరిగారు. ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం కేవలం ప్రకటనలే పరిమితమైనట్లుందని ఫిర్యాదులు అందించేందుకు వచ్చిన వారు వ్యాఖ్యానిస్తుడంటం సదరు పరిస్థితికి అద్దం పడుతోంది.
మెదక్‌జోన్:
29కి 14శాఖలే హాజరు
అధికారుల గైర్హాజరుతో నిరాశలో అర్జీదారులు వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువశాతం భూ సమస్యలే
ప్రజావాణికి పలువురు అధికారుల డుమ్మా
రేగోడ్(మెదక్): మండల కేంద్రమైన రేగోడ్ మండలపరిషత్ కార్యాలయంలో ప్రజావాణికి 29 శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉండగా.. కేవలం 14 శాఖల అధికారులు మాత్రమే హాజరయ్యారు. ఇందులోనూ ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఆలస్యంగా వచ్చారు. మర్పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేయాలని వినతిపత్రాన్ని అందజేశారు. డీఎస్సీలో తనకు ఎస్జీటీ ఉద్యోగం రావాల్సి ఉన్నా నకిలీ ధ్రువపత్రాలతో తనకంటే ముందున్న అభ్యర్థి ఉద్యోగం పొందారని, వారిని తొలగించి తనకు ఉద్యోగం ఇవ్వాలని అదే గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రజావాణికి కొందరు అధికారులు తమ సిబ్బందిని పంపించారు. ఎంపీడీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ..14శాఖల అధికారులు మాత్రమే హాజరయ్యారని గైర్హాజరైన అధికారుల నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని చెప్పారు.
అల్లాదుర్గం(మెదక్): పిల్లలు, విద్యార్థులు ఫోన్లకు దూరంగా ఉండాలని చెప్పే అధికారులే ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఫోన్లతో కాలక్షేపం చేశారు. మొన్న సర్వసభ్య సమావేశంలో, నేడు ప్రజావాణిలోనూ అధికారులు ఫోన్లతోనే గడిపారు. సోమవారం అల్లాదుర్గంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కష్టాలు చెప్పుకోవడానికి ప్రజలు వస్తే.. అధికారులు మాత్రం తమ ఫోన్లో వాట్సాప్, రిల్స్ చూడటానికే పరిమితమయ్యారు. ఫోన్లపై పెట్టే శ్రద్ధ ప్రజా సమస్యలపై పెడితే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.


