మెదక్‌జోన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో మెదక్ జిల్లాను పర్యాటకంగా అభివృద్ధిపర్చాల్సిన అవసరముందని మంత్రి వివేక్ పేర్కొన్నారు. ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే రోహిత్‌రావులతో కలిసి ఆయన ఖిల్లాపై పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పోస్టల్ కవర్‌పై మెదక్ ఖిల్లా చిత్రాన్ని ముద్రించటం వల్ల ఈ ప్రాంతం దేశ చరిత్రలో నిలుస్తుందన్నారు. ఖిల్లా అభివృద్ధికి కేంద్రం నుంచి ఎంపీ రూ.3 కోట్లు మంజూరు చేయిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాను నిధులు మంజూరు చేయిస్తానని.. ఇందుకోసం ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వదేశీ దర్శన్ కింద దీన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. గత పాలకులు ఈ ఖిల్లాను పట్టించుకోకపోవటంతో చరిత్ర మరుగున పడిందన్నారు. మొన్నటి వరకు మెదక్ జిల్లాగా పేరున్నా.. పాలనంతా సంగారెడ్డి నుంచి సాగిందన్నారు. ఇక్కడి ప్రజలు పోరాడి ప్రత్యేక జిల్లాను సాధించుకున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రోహిత్‌రావు, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, మున్సిపల్ చైర్మన్ కానుగ రాధిక, వైస్ చైర్మన్ నరేశ్‌గౌడ్ పాల్గొన్నారు.


