మెదక్‌జోన్: కల్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసే కుట్రచేస్తోందని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక అంబేడ్కర్ చౌరస్తా మెదక్ నియోజకవర్గపార్టీ శ్రేణులతో రాస్తారోకో, ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుపై స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు. ఈ పథకాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ హైకోర్టులో కేసు వేస్తే, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. రైతులకు యూరియా అందించడంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. పేదలకు ఉపయోగ పడే పథకాలను రద్దు చేయాలని చూస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నేతలు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి


