● ఎమ్మెల్యే సునీతారెడ్డి ● నర్సాపూర్ ఎంపీపీ సమావేశం ● అధికారుల సమయపాలనపై అసహనం
నర్సాపూర్/నర్సాపూర్ రూరల్: గ్రామ పంచాయతీలకు ఆదాయం లేకున్నా రూ.లక్షల్లో కరెంటు బిల్లులు వచ్చాయని ప్రభుత్వం వాటిని రద్దు చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్ చేశారు. ఎంపీడీఓ అధ్యక్షతన మంగళవారం జరిగిన నర్సాపూర్ ఎంపీపీ సమావేశానికి సునీతారెడ్డి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...గ్రామాల్లో గంజాయి, బెల్ట్ షాపులతో మత్తు పదార్థాలతో పాడువుతున్నారని ఎకై ్సజ్, పోలీస్ శాఖలు చర్యలు తీసుకోవాలన్నారు. కరెంటు సమస్యల పరిష్కారానికి విద్యుత్ సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
డుమ్మాకొట్టిన అధికారులపై
ఎమ్మెల్యే అసహనం
ఎంపీపీ సమావేశానికి డుమ్మా కొట్టిన అధికారులతో పాటు సమయపాలన పాటించకుండా సమావేశం మధ్యలో నుంచి వచ్చే పోయే అధికారులపై ఎమ్మెల్యే సునీతారెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం 2:30 గంటలకు ప్రారంభమైంది. సమావేశంలో కరెంట్ ఏఈ స్థాయి అధికారి అందుబాటులో ఉండకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కొంతమంది సర్పంచులు సభ దృష్టికి తెచ్చారు. ఇబ్రహీంబాద్, ఎల్లారెడ్డి గూడ, రూప్‌సింగ్ తండాలతోపాటు మండల కేంద్రానికి దూరంగా ఉన్న గ్రామాలకు మిషన్ భగీరథ తాగునీరు సరఫరా కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పీఆర్ డీఈ అమరేశ్వర్, తహసీల్దార్ శ్రీనివాస్ ఆయా శాఖల అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్‌తో చెక్కుల అందజేత
ఆమె తన క్యాంపు కార్యాలయంలో నర్సాపూర్, కౌడిపల్లి మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...సీఎం రిలీఫ్ ఫండ్ పథకంతో పేదలకు ఆర్థికంగా మేలు జరుగుతుందన్నారు.


