జిల్లాలో లోటు వర్షపాతం | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో లోటు వర్షపాతం

Jul 16 2026 7:18 AM | Updated on Jul 16 2026 7:18 AM

● ప్రత్యామ్నాయ పంటలపై ఫోకస్‌ ● వ్యవసాయశాఖ ముందస్తు ప్రణాళిక ● ఉచితంగా విత్తనాల పంపిణీ

● ప్రత్యామ్నాయ పంటలపై ఫోకస్‌ ● వ్యవసాయశాఖ ముందస్తు ప్రణాళిక ● ఉచితంగా విత్తనాల పంపిణీ

ఎల్‌నినో ముప్పు రానే వచ్చింది. వర్షాకాలం ప్రారంభమై నెలన్నర అవుతున్నా జిల్లాలో లోటు వర్షపాతమే నమోదైంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసింది. మూడు రకాల ఆరుతడి పంటలు సాగు చేయాలంటూ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అందులో మొదటి దశలో భాగంగా వందశాతం సబ్సిడీపై కంది విత్తనాలు పంపిణీ చేస్తున్నారు.

– మెదక్‌జోన్‌

జిల్లాలో ఈఏడాది 3.67 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారుల అంచనా వేశారు. అయితే ఎల్‌నినో అందరి అంచనాలను తలకిందులు చేసింది. దీని ప్రభావంతో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయటమే మేలని వ్యవసాయశాఖ ఇప్పటికే రైతులకు విరివిగా అవగాహన కల్పిస్తుంది. ఈనెల 15 వరకు సాధారణ వర్షపాతం నమోదు కాకుంటే కందులు, పెసర్లు, మినుములు సాగు చేయాలని, 31 వరకు వర్షం కురువకుంటే వేరుశనగ సాగు చేయాలని, ఆగస్టు 15 వరకు వర్షాలు లేకుంటే ఆముదం, పొద్దు తిరుగుడు, కంది పంటలు సైతం సాగు చేయొచ్చని అధికారులు వివరిస్తున్నారు.

మూడు దశలుగా విభజన

ఎల్‌నినో మెదటి దశలో భాగంగా జూలై 15 వరకు లోటు వర్షపాతం నమోదైన నేపథ్యంలో వందశాతం సబ్సిడీపై కంది విత్తనాలను పంపిణీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు 8 క్వింటాళ్ల విత్తనాలు జిల్లాకు సరఫరా కాగా, అందులో 6.12 క్వింటాళ్లు రైతులకు సరఫరా చేసినట్లు సంబంధిత వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఇందులో వర్షధారంగా పంటలు సాగుచేసే నల్లరేగడి భూముల్లో కంది సాగుకు అనువైనవిగా గుర్తించిన అధికారులు అల్లాదుర్గం, రేగోడ్‌, పెద్దశంకరంపేట, టేక్మాల్‌ మండలాలతో పాటు శివ్వంపేట, తూప్రాన్‌, నిజాంపేట మండలాల్లో సైతం ఉచిత విత్తనాల పంపిణీ జరిగింది. మరికొన్ని మండలాలకు త్వరలో పంపిణీ చేయనునట్లు తెలిసింది.

రైతుల్లో ఆసక్తి అంతంతే..

ఎల్‌నినోతో ప్రమాదం పొంచి ఉందని, ఇప్పటికే మొదటి దశ ప్రారంభమైన నేపథ్యంలో వరి సాగుకు బదులు ఇతర ఆరుతడి పంటలు సాగు చేయాలని అధికారులు పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నా, రైతులు పెద్దగా ఆసక్తి కనబరచడం తెలుస్తోంది. వరి, ఆయిల్‌పాం సాగు తప్ప ఇతర పంటలను సాగు చేస్తే తమకు కోతులతో ప్రమాదం ఉందంటున్నారని అధికారులు చెబుతున్నారు. కాగా బోరుబావుల ఆధారంగా ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 81 వేల ఎకరాల్లో వరి సాగు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మరో 15 రోజుల పాటు వర్షాలు కురవకుంటే బోరుబావుల్లో నీటి ఊటలు తగ్గిపోయి నాట్లు ఎండిపోయే ప్రమాదం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

వరి సాగుతో నష్టమే..

వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొన్న విధంగా ఎల్‌నినో ప్రభావం జిల్లాపై ఉంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఉన్నతాధికారుల సూచనలు పాటించి రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి. వరిసాగు చేస్తే పెట్టుబడులు నష్టపోవాల్సి వస్తోంది.

– దేవ్‌కుమార్‌, జిల్లా

వ్యవసాయశాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement