6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు బోధన ఒక్కో ఇన్‌స్ట్రక్టర్‌కు రెండు పాఠశాలల్లో బోధన బాధ్యతలు 22 నుంచి ప్రారంభించే అవకాశం!
ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదటి విడతలో 475 ప్రభుత్వ పాఠశాలలు ఎంపిక
సాక్షి, సిద్దిపేట: పాఠశాలలో డిజిటల్ విద్యను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందించాలని లక్ష్యంతో కంప్యూటర్ విద్యను ప్రారంభించింది. త్వరలో జిల్లాలో పలు పాఠశాలలో కంప్యూటర్ విద్యను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకుగాను కొన్ని పాఠశాలలను ఎంపిక చేసి ఇన్‌స్ట్రక్టర్లను ప్రభుత్వం నియమించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2008 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలలో కంప్యూటర్ విద్యకు శ్రీకారం చూట్టారు. అయితే 2014లో కంప్యూటర్ విద్యా బోధన నిలిపివేశారు. అప్పటి నుంచి కంప్యూటర్ విద్యను బోధించే ఇన్‌స్ట్రక్టర్ లేకపోవడంతో కంప్యూటర్ విద్యకు విద్యార్థులు దూరమయ్యారు. కంప్యూటర్ విద్యను అందించేందుకు ఈ విద్యా సంవత్సరం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తొలి దశలో 475 పాఠశాలలను ఎంపిక చేశారు. అందులో సిద్దిపేటలో 177, సంగారెడ్డిలో 179, మెదక్‌లో 119 పాఠశాలలున్నాయి.
6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు
ప్రభుత్వ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కంప్యూటర్ బోధనను అందించనున్నారు. కంప్యూటర్ విద్యను పాఠశాల స్థాయిలోనే అందించడం వలన ఉన్నతవిద్యకు ఎంతగానో దోహపడనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం నేర్చుకోవడం వలన కంప్యూటర్‌లో ద్వారా చేసే పనులు త్వరగా పూర్తి చేసే సామర్థ్యం విద్యార్థులలో రానుంది. కొత్తగా కంప్యూటర్ ల్యాబ్‌లను సైతం ఏర్పాటు చేయనున్నారు. పలు చోట్ల ఉన్న ల్యాబ్‌లను పునరుద్ధరించనున్నారు.
ఒక్కో ఇన్‌స్ట్రక్టర్‌కు రెండు పాఠశాలలు
రెండు పాఠశాలలకు కలిపి ఒక ఇన్‌స్ట్రక్టర్‌ను నియమించనున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో 237 మంది ఇన్‌స్ట్రక్టర్లను నియమించనున్నారు. ఆ రెండు పాఠశాలలు ఒకే మండలంలో, దగ్గర ఉండే విధంగా విద్యాశాఖ మ్యాపింగ్ చేస్తున్నారు. ఈ ఇన్‌స్ట్రక్టర్‌లను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించుకునేందుకు రాష్ట్రస్థాయిలో ఓ ఏజెన్సీకి బాధ్యతలను అప్పగించారు. ఈ నెల 22 నుంచి కంప్యూటర్ బోధను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


