ప్లాస్టిక్ నిషేధంపై పట్టింపు కరువు
● జిల్లాలో ప్రమాదకరంగా పెరిగిన వినియోగం ● తీర్మానానికే పరిమితమైన బల్దియా
మెదక్ కలెక్టరేట్: ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణానికి పెనుముప్పుగా తయారయ్యాయి. నిషేధిత కవర్లు, వస్తువులు వినియోగించొద్దని, అమ్మకాలు జరపకూడదనే ఆదేశాలు ఉన్నా క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు ముందుకురావడం లేదు. ఫలితంగా పట్టణంలో ఎటుచూసినా ప్రమాదకరమైన ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. గతంలో ఇక్కడ పనిచేసిన కలెక్టర్ రాహుల్‌రాజ్ జిల్లాలో ప్లాస్టిక్ నిషేధం కఠినంగా అమలు చేస్తామని ప్రకటించినా, అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం కలెక్టరేట్‌లోనే ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు పంపిణీ చేయడం గమనార్హం.
తీర్మానానికే పరిమితం
మెదక్ బల్దియా నూతనంగా కొలువుదీరిన తర్వాత రెండో సమావేశంలోనే ప్లాస్టిక్ నిషేధంపై తీర్మానం చేశారు. అయితే పట్టణంలో ఎక్కడా అమలుకు చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపించలేదు. గతంలో ఎమ్మెల్యే రోహిత్‌రావు ఆదేశాలతో నిలిపివేసిన తైబజార్ వసూళ్లు మళ్లీ మొదలు పెట్టారు. కాని పట్టణంలో పెరుగుతున్న ప్రమాదకర ప్లాస్టిక్ నిర్మూలనకు చర్యలు చేపట్టం లేదని పట్టణవాసులు మండిపడుతున్నారు. గతంలో మున్సిపల్ అధికారులు అడపాదడపా తనిఖీలు చేసి జరిమానాలు వేశారు. ప్రస్తుతం అవి కూడా చేయడం లేదు. జిల్లా కేంద్రంలో కొంతమంది తమ తమ ఇళ్లలో మిగిలిపోయిన ఆహార పదార్థాలు ప్లాస్టిక్ కవర్లలో వేసి రోడ్డు పక్కన పారవేస్తున్నారు. ఫలితంగా వాటి కోసం కుక్కలు, కోతులు పోటీపడుతున్నాయి. అటువైపు నుంచి వెళ్తున్న ప్రజలపై దాడులకు దిగుతున్నాయి.
రోజుకు 4 టన్నులు
మెదక్ బల్దియాలో 32 వార్డులు ఉండగా, రోజుకు 12 టన్నుల చెత్త సేకరిస్తే అందులో 4 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక జిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన చేగుంట, తూప్రాన్, రామాయంపేట, చిన్నశంకరంపేట మండలాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు మరింత ఎక్కువగా ఉంటాయి. వాటి నియంత్రణ లేక విచ్చలవిడిగా కాలుష్యం పెరిగిపోతుంది.
చర్యలు చేపడతాం
ప్లాస్టిక్ నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. దీనిపై ఇటీవల అధికారులు, సిబ్బందికి ఆదేశాలు ఇచ్చాం. త్వరలోనే పూర్తిస్థాయిలో అమలుకు కృషి చేస్తాం. ప్లాస్టిక్ కవర్లను ప్రజలు వినియోగించవద్దు. ప్రాణాంతకమైన కేన్సర్ ముప్పు ఉందని గ్రహించాలి.
– నవీన్, మెదక్ మున్సిపల్ కమిషనర్


