పంచాయతీలకు ఊరట
మెదక్‌జోన్: సంక్రాంతి వేళ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు తీపి కబురు అందించింది. జిల్లాకు రూ. 6.70 కోట్లు విడుదల చేసింది. వీటిని అభివృద్ధికి కేటాయించాలని సూచించింది. అయితే గడిచిన రెండేళ్లకు సంబంధించి రావాల్సిన నిధులు కొండంత కాగా, వచ్చింది మాత్రం గోరంతేనని పలువురు పెదవి విరుస్తున్నారు. జిల్లాలో 21 మండలాలు, 492 గ్రామాలు ఉండగా, 7.24 లక్షల మంది జనాభా ఉన్నారు. జనాభా ప్రాతిపదికన జిల్లాకు ప్రతీ నెల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ. 6.70 కోట్లు రావాలి. ఆ నిధులను పారిశుద్ధ్య కార్మికుల వేతనాలతో పాటు పంచాయతీ అభివృద్ధికి వెచ్చిస్తుంటారు. కాగా 2024 జనవరి నుంచి పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవటంతో ఆ నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. గడిచిన కాలానికి సంబంధించి మొత్తం జిల్లాకు రూ. 160.80 కోట్లు రావాల్సి ఉండగా, కేవలం రూ. 6.70 కోట్లు మాత్రమే వచ్చినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఈ లెక్కన కేవలం 4.16 శాతం మాత్రమేనని పలువురు వాపోతున్నారు.
కార్యదర్శులు వెచ్చించింది ఎక్కువే..
పాలకవర్గాల గడువు ముగియగానే జిల్లా అధికారులు పల్లెలకు ప్రత్యేక అధికారులను నియమించారు. అయితే వారు ఏనాడు పల్లెలను పట్టించుకున్న పాపానపోలేదు. దీంతో నిర్వహణ భారం కార్యదర్శులపై పడింది. అవసరాలకు అప్పులు చేసి రెండేళ్లుగా గ్రామాలను నెట్టుకొచ్చారు. దీంతో ఒక్కో పంచాయతీ కార్యదర్శి రూ. 1.50 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు అప్పులు చేసినట్లు తెలిసింది. మొత్తంగా కార్యదర్శులు తెచ్చిన అప్పులే రూ. 8 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. కాగా జిల్లా కు కేవలం రూ. 6.70 కోట్లు మాత్రమే రావటంతో పెదవి విరుస్తున్నారు.
నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
జిల్లాకు రూ. 6.70 కోట్లు కేటాయింపు
రెండేళ్లుగా రావాల్సింది రూ. 160.80 కోట్లు


