అన్నా పండుగొచ్చిందే..!
● ఆశావహులకు సంక్రాంతి భారం
● ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు దావత్‌లు
● తడిసి మోపడవుతున్న ఖర్చు
మెదక్‌కలెక్టరేట్: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్న ఆశావహులకు సంక్రాంతి పండుగ ఖర్చు తడిసి మోపెడవుతోంది. రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఇప్పటికే జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఆశావహు లు పండుగ వేళ ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. మీ మద్దతు తనకే ఇవ్వాలంటూ వేడుకుంటున్నారు. ఇదే సమయంలో సంక్రాంతి రావడంతో అన్నా పండగొచ్చింది.. దావత్ లేదా? అంటూ యువకులు, పెద్దలు అడగటంతో చేసేది లేక ఖర్చు పెడుతున్నారు. నోటిఫికేషన్ రాకముందే ఖర్చు ఇలా ఉంటే తర్వాత ఎలా? అని ఆందోళన చెందుతున్నారు. పండుగ ఖర్చు కాదంటే.. ఓట్లు పోతాయన్న భయంతో భరిస్తున్నామని చెబుతున్నారు. ఇదే సమయంలో ఎలాగైనా గెలవాలన్న తపనలో ఉన్న కొంతమంది పండుగను ఆసరా చేసుకొని ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కాగా ఎన్నికల కమిషన్ రిజర్వేషన్లను ప్రకటించడంతో ఇక ఏ క్షణ మైన షెడ్యుల్ విడుదల చేసే అవకాశ ం ఉంది.
జిల్లాలో నాలుగు బల్దియాలు
జిల్లాలో మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. మెదక్‌లో 32, నర్సాపూర్ 15, తూప్రాన్ 16, రామాయంపేటలో 12 వార్డులు ఉన్నాయి. వార్డులకు సంబంధించిన ఓటరు తుది జాబితాను ఇప్పటికే ప్రకటించారు. నాలుగు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 87,185 మంది ఓటర్లు ఉన్నారు.


