కొండెక్కిన కోడి
మెదక్‌కలెక్టరేట్: సంక్రాంతికి మాంసం ధరలు చుక్కలనంటుతున్నాయి. కొనక ముందే కుత కుత ఉడుకుతున్నాయి. పండుగ సందర్భంగా చాలా మంది ఇంట్లో చికెన్, మటన్ వండుకుంటారు. అతిథులకు కూడా రకరకాల నాన్‌వెజ్ వంటకాలను వడ్డిస్తారు. అయితే చికెన్ ధరలు ఇప్పటికే ట్రిపుల్ సెంచరీ దాటి పరుగులు పెడుతుండటం మాంసం ప్రియులను ఆందోళనకు గురిచేస్తుంది. పండుగ నాటికి డిమాండ్ పెరిగితే ధరలు రూ. 350 దాటే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. చికెన్ ధరలు ఆకాశాన్ని తాకడంతో సామా న్యులు, పేదలు చికెన్ కొనాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. కాగా ప్రస్తుతం మార్కెట్లో స్కిన్‌లెస్ చికెన్ నెల రోజులుగా రూ. 300 పలుకుతోంది. గతంలో స్కిన్‌లెస్ చికెన్ కిలో ధర రూ. 200 ఉండేది. కానీ ఇప్పుడు అదే చికెన్ ధర రూ. 300 నుంచి రూ. 320 వరకు ఉంది. మార్కెట్లో కోళ్ల లభ్యత ఆధారంగా ధరలను వ్యాపారులు నిర్ణయించనున్నారు. పండుగకు అందరూ మాంసం వంటలు ఘుమఘుమ లాడించడంతో ధరలు కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. కేజీ మటన్ రూ. 800 నుంచి రూ. 100 వరకు పలుకుతోంది. నాటు కోళ్ల ధరలు సైతం విపరీతంగా పెరిగాయి. మటన్ ధరలతో సమానంగా ఉన్నాయి. గతంలో నాటుకోడి రూ.400 నుంచి రూ. 500 లోపు పలికేది. పండుగ సీజన్ కావడంతో వాటి ధరలకు కూడా రెక్కలొచ్చాయి.
కిలో రూ. 300 నుంచి రూ. 320
గతంలో ఎన్నడూ లేని విధంగా ధర
నాటుకోళ్ల ధరలూ పెరిగాయి
పండుగపూట మాంసం ప్రియుల జేబులకు చిల్లు


