జిల్లాల పునర్విభజనపై రేకెత్తిస్తున్న ఆశలు
శంకరంపేట మండలాన్ని సంగారెడ్డిలో కలపాలి
అసెంబ్లీ నియోజక వర్గాల
పునర్విభజన తర్వాతే...
‘నాగిరెడ్డిపేట మండలాన్ని 20 కి.మీ దూరంలో ఉన్న మెదక్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ 2016 అక్టోబర్‌లో హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై పెట్రోల్ పోసుకొని, నిప్పంటించుకొని చనిపోయాడు మాల్తుమ్మెదకు చెందిన ఉడావాటి రాజు. అయినా ఇంత వరకు అతని కోరిక నెరవేరలేదు. నెలల తరబడి మండలవాసులు చేసిన పోరాటం ఫలించలేదు. చివరకు కామారెడ్డి జిల్లాలోనే కలసి పోయింది.’
మెదక్ అర్బన్
జిల్లాల పునర్విభజనలో రాజకీయ నాయకులు ప్రజాభిప్రాయాన్ని గాలికొదిలాశారు. అశాసీ్త్రయ విభజనతో అంతులేని ఆవేదన మిగిల్చారని విమర్శలున్నాయి.
పలు గ్రామాల ప్రజలు ఒక జిల్లాలో ఉంటూ.. మరో నియోజక వర్గం ప్రతినిధులను ఎన్నుకుంటున్నారు. దీంతో ఒకే రాజకీయ పార్టీలో గ్రూపు తగాదాలు రచ్చ కెక్కుతున్నాయి. ఇద్దరు నాయకుల మధ్య స్థానిక క్యాడర్ సతమతమవుతోంది. ఈ జిల్లా మాకు అనుకూలంగా లేదు. అనుకూలమైన జిల్లాలో కలపాలంటూ పలు మండలాల ప్రజలు యేళ్ల తరబడి డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద ఉమ్మడి మెదక్ జిల్లా అశాసీ్త్రయ విభజన.. జనాల్లో అంతులేని ఆవేదన మిగిల్చింది. తిరిగి జిల్లాల పునర్విభజన అంశానికి సంబంధించి కమిషన్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో పునర్విభజనపై మళ్లీ చర్చ మొదలైంది.
అశాసీ్త్రయ విభజన
జిల్లా పేరును తనలో ఇముడ్చుకున్న మెదక్ 2016లో సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ పేర్లతో మూడు ప్రత్యేక జిల్లాలుగా అవతరించాయి. ఉమ్మడి జిల్లా ప్రజల దశాబ్ధాల డిమాండ్ నెరవేరినప్పటికీ, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాలతో పోలిస్తే.. మెదక్ అతి చిన్న జిల్లాగా అవతరించింది. ఉమ్మడి జిల్లాలో రెవెన్యూ డివిజన్‌గా ఉన్న మెదక్‌లో 18 మండలాలు ఉండగా.. కొత్త జిల్లా కేవలం 15 మండలాలతో ఏర్పడింది. అనంతరం మరో 6 మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి. సిద్ధిపేటలో మూడు రెవెన్యూ డివిజన్లు, 508 పంచాయతీలు, సంగారెడ్డిలో నాలుగు రెవెన్యూ డివిజన్లు 633 పంచాయతీలు, మెదక్‌లో నాలుగు రెవెన్యూ డివిజన్లు 492 పంచాయతీలు ఉన్నాయి. 2011 లెక్కల ప్రకారం జిల్లా జనాబా 5,65,741. అయితే అభివృద్ధి చెందిన ప్రదేశాలు, అననుకూల ప్రదేశాలు పొరుగు జిల్లాల్లో కలిశాయని, అప్పట్లో ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా ఒకటి.. నియోజకవర్గం మరొకటి..
మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్ మండలాలు మెదక్ జిల్లాలో ఉండగా, సంగారెడ్డి జిల్లాలోని అందోల్ అసెంబ్లీ నియోజక వర్గ ఓటర్లుగా తమ ఎమ్మెల్యేను ఎన్నుకుంటున్నారు. అలాగే చేగుంట, నార్సింగ్ మెదక్ జిల్లాలో, దుబ్బాక నియోజక వర్గంలో, తూప్రాన్, మనోహరాబాద్ మెదక్ జిల్లాలో, గజ్వేల్ నియోజక వర్గంలో, శంకరంపేట(ఏ) మెదక్ జిల్లాలో, నారాయణఖేడ్ నియోజక వర్గంలో, హత్నూర సంగారెడ్డి జిల్లాలో నర్సాపూర్ నియోజక వర్గంలో కొనసాగుతున్నాయి. మెదక్ జిల్లాలో రెండు, సిద్ధిపేట జిల్లాలో నాలుగు, సంగారెడ్డి జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. దీంతో ఆయా జిల్లాల్లో ఒకే రాజకీయ పార్టీ అఽధ్యక్షుల మధ్య గ్రూపు తగాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన డీసీసీ ఎన్నికలు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నామినేటెడ్ విషయంలో ఒకే పార్టీకి చెందిన అందోల్, గజ్వేల్, మెదక్ నియోజక వర్గాల కాంగ్రెస్ బాస్‌ల మధ్య నెలకొన్న అభిప్రాయ భేదాలు. ఆధిపత్య పోరుకు తెర లేపాయి. అలాగే మెదక్ జిల్లాను రాజన్న సిరిసిల్ల జోన్ నుంచి చార్మినార్ జోన్‌కు మార్చాలని జిల్లా ఉద్యోగులు, నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
●
జిల్లా ఒకచోట.. మండలం, నియోజకవర్గం మరోచోట..
అనుకూల జిల్లాలో కలపాలంటున్న మండలవాసులు
రాజకీయ పార్టీల్లోనూ గ్రూపు తగాదాలు
చార్మినార్ జోన్ కావాలంటున్న నిరుద్యోగులు, ఉద్యోగులు
పునర్విభజనతో మెతుకు సీమ మెరిసేనా.. !
ముఖ్యమంత్రి ప్రకటనతో జిల్లాల పునర్విభజనపై మళ్లీ ఆశలు రేకెత్తిస్తున్నాయి. అశాసీ్త్రయ విభజనతో ఉమ్మడి మెదక్ జిల్లావాసులు అనేక అవస్థలు పడుతున్నారు. మండలం ఒకజిల్లాలో ఉంటే.., నియోజకవర్గం మరో జిల్లాలో.. రెవెన్యూ డివిజన్ ఇంకో చోట ఉంటుంది. ఇలా మూడు ముక్కలాటగా మారిన విభజనతో జిల్లావాసులకు అంతులేని ఆవేదన మిగిల్చింది.
పెద్ద శంకరంపేట మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపాలి.భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా మాకు మెదక్ కన్నా, సంగారెడ్డి అనుకూలం. అల్లాదుర్గం, రేగోడ్ మండలాల ప్రజలకు కూడా సంగారెడ్డి దగ్గర. మేము మెదక్ వెళ్లాలంటే, ఇతర జిల్లాకు వెళ్లినట్లు ఉంటుంది. మాకున్న కుటుంబ సంబంధాలు, ఉద్యోగ స్థలాలు సంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. –జోడు రవీందర్. శంకరంపేట
అసెంబ్లీ నియోజక వర్గాల తర్వాతే జిల్లాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభించాలి. అప్పుడే ప్రస్తుతమున్న సమస్యకు పరిష్కారం లభిస్తుంది. జిల్లాలు, మండలాలను తగ్గింపు, పెంచే ఆలోచన తగదు. ఉన్న వాటిలో సమస్యలను గుర్తంచి సర్దుబాటు చేయాలి. నిరుద్యోగులకు న్యాయం చేసేందుకు మెదక్‌ను చార్మినార్ జోన్‌లో కలిపేందుకు చర్యలు తీసుకోవాలి.
–బి.కొండల్ రెడ్డి,
మాజీ టీపిటిఎఫ్, రాష్ట్ర అధ్యక్షులు
జిల్లాల పునర్విభజనపై రేకెత్తిస్తున్న ఆశలు
జిల్లాల పునర్విభజనపై రేకెత్తిస్తున్న ఆశలు
జిల్లాల పునర్విభజనపై రేకెత్తిస్తున్న ఆశలు


