నిర్లక్ష్యం.. బతుకులు ఛిద్రం
● అతివేగంతోనే ప్రమాదాలు: ఎస్పీ శ్రీనివాసరావు
కొల్చారం(నర్సాపూర్): అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు అవుతున్నాయని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని పోతంశెట్టిపల్లి గ్రామంలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎస్పీ హాజరై మాట్లాడారు. చిన్న పార్టీ నిర్లక్ష్యం ప్రాణాలనే హరిస్తుందన్నారు. అలాగే.. కుటుంబాలు రోడ్డుపాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 13 నుంచి 24 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాహనాలు నడిపే సమయంలో సీటు బెల్టు, హెల్మెట్ ధరించాలన్నారు. అనంతరం గ్రామంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. అనతరం రోడ్డు భద్రత పోస్టర్‌ను ఆవిష్కరించి, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు ఎస్పీ క్రికెట్ టోర్నీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్టీసీ డీపో మేనేజర్ సురేఖ, మెదక్ రూరల్ సీఐ జార్జ్, ఏఎంవీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ హైమద్ మోహినొద్దీన్, సర్పంచ్ దయాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడా స్ఫూర్తితో జీవితాన్ని గెలవాలి: అడిషనల్ ఎస్పీ మహేందర్
పాపన్నపేట(మెదక్): ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తితో జీవితాన్ని గెలవాలని మెదక్ అడిషనల్ ఎస్పీ మహేందర్ పిలుపునిచ్చారు. మండల పరిధి మిన్‌పూర్‌లో మంగళవారం జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన మాట్లాడారు. కబడ్డీ గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందన్నారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థి జీవితంలో ఆటలు భాగస్వామ్యం కావాలని సూచించారు. మిన్‌పూర్ లాంటి చిన్న గ్రామం నుంచి పలువురు యువకులు, విద్యార్థులు జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సృజన, యేసురత్నం, ఉపసర్పంచ్ కిరణ్, ప్రభాకర్‌రెడ్డి, ఐజేయూ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్, క్రీడాకారులు పాల్గొన్నారు.


