రూ2.50 కోట్లు స్వాహా
● మున్సిపల్ మాజీ చైర్మన్ జితేందర్‌గౌడ్ ఆరోపణ
● నకిలీ బిల్లులతో నిధులు కాజేశారని ధ్వజం
రామాయంపేట (మెదక్): స్థానిక మున్సిపాలిటీ పరిధిలో భారీస్థాయిలో రూ.2.50 కోట్ల మేర అవినీతి జరిగిందని మున్సిపల్ మాజీ చైర్మన్ జితేందర్‌గౌడ్ ఆరోపించారు. మంగళవారం ఆయన బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. బుట్టల కొనుగోలు, బ్లీచింగ్, మొక్కల పెంపకం, చెత్త సేకరణ ట్రాక్టర్లు, ఆటోల్లో డీజిల్ వినియోగం వంటి వాటిలో అవినీతి చోటు చేసుకుందని తెలిపారు. తన హయాంలో కొనుగోలు చేసిన బుట్టలు కార్యాలయంలో నిలువ ఉండగా ఇటీవల రూ.32 లక్షలు ఖర్చుతో 12,600 చెత్త సేకరణ బుట్టలు, రూ.15లక్షలతో బ్లీచింగ్ కొనుగోలు చేసినట్లు నకిలీ బిల్లులు సృష్టించి నిధులు స్వాహా చేశారన్నారు. మున్సిపల్ కమిషనర్ దేవేందర్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల సహకారంతో నిధులను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, అధికారులు వీరిపై చర్యలు తీసుకోకపోతే రామాయంపేట పట్టణం బంద్ చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సహకార సంఘం మాజీ చైర్మన్ బాదెచంద్రం, సీనియర్ నాయకులు అహ్మద్, హస్నొద్దీన్, పార్టీ యూత్ విభాగం మండలశాఖ అధ్యక్షుడు ఉమ, నాయకులు నాగార్జున, చింతల రాములు, రమేశ్, బాసం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


