షాపును బట్టి వసూలు
జిల్లా నుంచి రూ. 1.50 కోట్ల ముడుపులు జిల్లా అధికారుల నుంచి స్టేట్ బాస్‌ల వరకు వాటాలు ఒక్కో షాపు నుంచి రెండేళ్లలో రూ. 10 లక్షలు వసూలు
మెదక్ అర్బన్
వందల కొద్ది దరఖాస్తులు.. ఫీజు లకు లక్షలాది రూపాయలు.. ఒకటో, రెండో వైన్‌షాపులు దక్కించుకున్న యజమానులకు ‘గుడ్ విల్ దందా.. గోటి చుట్టుపై రోకటి పోటు’లా మారింది. షాపులను బట్టి సాగుతున్న కాసుల వేటలో జిల్లా నుంచి రాష్ట్రస్థాయి బాస్‌ల వరకు వాటాలున్నాయన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మరో వైపు నెల నెలా స్టేషన్ మామూళ్లు.. ఆరునెలల కోసారి స్పెషల్ పార్టీ వసూళ్లు, పండగలు.. పబ్బాలకు లిక్కర్ బాటిళ్ల పంపకాలు.. వెరసి రెండేళ్లలో రూ. 10 లక్షలు మామూళ్ల పాలవుతున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
49 వైన్ షాపులు.. 5 బార్‌లు
జిల్లాలో 49 వైన్‌షాపులు.. 5 బార్‌లు ఉన్నాయి. ఈఏడాది కొత్త ఎకై ్సజ్ సంవత్సరం డిసెంబర్ 1 నుంచి ప్రారంభం అయ్యింది. వైన్‌షాపుల మీద ఉన్న మోజులో కొంతమంది కలిసి సిండికేట్లుగా ఏర్పడ్డారు. సుమారు 50 నుంచి 160 వరకు దరఖాస్తులు చేశారు. రూ. 3 లక్షల చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించి, చివరకు ఒక్కటో.. రెండో షాపులు దక్కించుకున్నారు. అయితే లైసెన్స్‌ల మంజూరు ప్రక్రియలో నిబంధనలను సాకుగా తీసుకొని ఎక్సైజ్ అధికారులు ‘గుడ్ విల్’ దందాకు తెరలేపారన్న ఆరోపణలున్నాయి. ఇది చాలా ఏళ్లుగా సాగుతున్నట్లు తెలుస్తోంది.
గుడ్ విల్ పేరిట షాపును బట్టి రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ డబ్బులో జిల్లా అధికారుల నుంచి రాష్ట్రస్థాయి బాస్‌ల వరకు వాటాలున్నాయన్న ప్రచారం ఉంది. ఈ లెక్కన చూస్తే జిల్లా నుంచి సుమారు 1.5 కోట్లు వసూలు అవుతున్నట్లు సమాచారం. ఇవిగాక షాపును బట్టి, నెల మామూలు రూ. 20 వేల నుంచి రూ. 25 వేల వరకు ఠంచన్‌గా వసూలు చేస్తుంటారని తెలిసింది. ఇక డీటీఎఫ్, ఎస్టీఎఫ్ పార్టీలకు 6 నెలలకోసారి ఒక్కోషాపు నుంచి రూ. 40 నుంచి రూ. 50 వేల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ఏసీ, డీసీ స్థాయిలో ఆరు నెలలకోసారి జాయింట్‌గా రూ. 40 ను ంచి రూ. 50 వేలు ఇస్తుంటారు. మామూళ్లు వసూలు చేయడానికి కానిస్టేబుల్ నుంచి సీఐ స్థాయి వరకు రంగంలోకి దిగుతుంటారు. ఇక దసరాకు ఒక్కో వైన్‌షాపు నుంచి 3 నుంచి 4 కాటన్ల మద్యం ఫుల్‌బాటిళ్లు తీసుకెళ్తుంటారు. వైన్‌షాపు తనిఖీలకు వస్తే డీజిల్ డబ్బులు అదనం. ఇవన్నీ కలిపితే రెండేళ్లలో ఒక్కో షాపు నుంచి సుమారు రూ. 10 లక్షల వరకు మామూళ్ల రూపంలో వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇన్‌చార్జి ఈఎస్ శ్రీనివాస్‌రెడ్డిని వివరణ కోరేందుకు ఫోన్‌లో ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు.
ఎకై ్సజ్‌వారి పాట రూ. 3 లక్షలు


