పుర ఓటర్లు 87,375
రామాయంపేట(మెదక్)/మెదక్‌మున్సిపాలిటీ: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటర్ల తుది జా బితా సోమవారం విడుదలైంది. ఈమేరకు సాయంత్రం ఆయా మున్సిపల్ కమిషనర్లు, మేనేజర్లు కొత్త ఓటర్ జాబితాను విడుదల చేశారు. జిల్లా పరిధిలోని నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 75 వార్డుల్లో 87,375 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈనెల 1న విడుదల చేసిన ముసాయిదా జాబితాల్లో వందల సంఖ్యలో మృతుల పేర్లతో పాటు ఇతర గ్రామాలకు చెందిన ఓటర్ల వివరాలు చోటు చేసుకున్నా యి. దీంతో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు ఈనెల 5వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించారు. అదే రోజు పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. అభ్యంతరాలను పరిష్కరించి తుది జాబితా విడుదల చేశారు. మంగళవారం పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ముసాయిదా జాబితా ప్రకటించనున్నారు. 16న ఫొటోలతో కూడిన లిస్ట్ విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అర్హత ఉన్న కొత్త ఓటర్లను చేర్చుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. పట్టణాల్లో యువ ఓటర్లను ఆశావహులు నమోదు చేయించినా, ఓటు హక్కు లభించలేదు.
రిజర్వేషన్ల మార్పు తఽథ్యం
గత ప్రభుత్వం 2019లో నూతన పురపాలిక చట్టం రూపొందించి రెండు పర్యాయాలు ఒకే రిజర్వేషన్ కొనసాగే విధంగా చట్టం చేసింది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిబంధనలు తొలగించేలా సవరణ బిల్లును ఆమోదించింది. దీంతో రెండు పర్యాయాల రిజర్వేషన్లు రద్దయినట్లే. ముందుగా ఎస్సీ, ఎస్టీకి రిజర్వ్ చేసిన తర్వాత 50 శాతానికి మించకుండా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. మహిళలకు ఆయా సామాజిక వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్లలో విధిగా 50 శాతం కేటాయించనున్నారు.
మహిళా ఓటర్లే కీలకం
ఈసారి జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకంగా మారనున్నారు. కౌన్సిలర్‌గా పోటీపడే అభ్యర్థులు ఇక మహిళలను ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలో గత అసెంబ్లీ, సర్పంచ్ ఎన్నికల్లోనూ మహిళా ఓటర్లే కీలకమయ్యారు. ఇక మున్సిపోల్స్ వంతు వచ్చింది. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల జయపజయాలను వారే నిర్ణయించనున్నారు. వారిని మెప్పించగలిగితే గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయని నాయకులు భావిస్తున్నారు. మెదక్ పట్టణంలో మొత్తం 32 వా ర్డులు ఉండగా, మొత్తం ఓటర్లు 36,955 ఉన్నారు. ఇందులో అత్యధికంగా మహిళా ఓటర్లు 19,406, పురుషులు 17,548 మంది, ఇతరులు ఒకరు ఉన్నారు.


