గ్రూపుల లొల్లి
కాంగ్రెస్‌లో గందరగోళం
● అయోమయంలో నాయకులు ● బల నిరూపణలకు విందులు, వినోదాలు ● తూప్రాన్ మున్సిపాలిటీలో రాజకీయాలు రసవత్తరం
తూప్రాన్: మున్సి‘పోల్స్’ అధికార పార్టీ నాయకుల్లో ఆశలు రేకెత్తిస్తుండగా, గ్రూపుల లొల్లి గందరగోళంలో పడేసింది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలు నర్సారెడ్డి, మైనంపల్లి హన్మంతరావు వర్గాలుగా చిలిపోయారు. ఎటు మొగ్గు చూపుతే ఏం జరుగుతుందో తెలియక సతమతమవుతున్నారు. ఇప్పటికే టికెట్ల కోసం ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అదేస్థాయిలో బీఫాం ఎవరు ఇస్తారనేది తెలియక ఆయోమయంలో పడ్డారు.
ఎవరికి వారే..
మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ మున్సిపాలిటీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మేజర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారిన తర్వాత మొదటిసారి జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయకేతనం ఎగురవేసింది. ఆ పార్టీ అభ్యర్థి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో మున్సిపాలిటీని కై వసం చేసుకునేందుకు నేతలు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం అధిష్టానం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి నర్సారెడ్డి, సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డికి పూర్తి బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే స్థానిక కాంగ్రెస్ నాయకులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. అర్హులకు బీఫాంలు ఇవ్వాలని అంతర్గతంగా చర్చించారు. కాగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సైతం గజ్వేల్ నియోజకవర్గంలో తన ఉనికిని చాటుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో పుట్టినరోజు వేడుకలు, వివాహాలు, జాతరలకు తన అనుచరగణంతో హాజరవుతున్నారు. ఇక్కడి నాయకులు కొందరు ఆయనతో జతకడుతున్నారు. తనకున్న పలుకుబడితో బీఫాం ఇప్పిస్తారని భావిస్తున్నారు. అయితే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని అయోమయంలో పడ్డారు.
చైర్మన్ పీఠంపై గురి
మున్సిపల్ చైర్మన్ పీఠంపై కన్నేసిన కాంగ్రెస్ నాయకులు కొందరు ఇప్పటికే బల నిరూపణకు తెరలేపారు. విందులు వినోదాలతో ఆకట్టుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. బీఫాం ఇస్తే ఎన్ని డబ్బులు అయినా ఖర్చు చేసేందుకు వెనకాడమని బాహాటంగా చెబుతున్నారు. చైర్మన్ రేసులో ఉన్నామని ప్రచారం చేసుకుంటున్నారు. కాగా రిజర్వేషన్లు తేలకపోవడంతో డైలామాలో పడ్డారు.


